Tuesday, April 1, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

జిల్లా కలెక్టర్‌లకు పంపించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నూతన మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. అయితే తాజాగా, ఇందిరమ్మ పథకానికి సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌లకు కొత్త గైడ్‌లైన్స్‌ను పంపించింది. అయితే, కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం నిర్మాణాలు జరగాలని ప్రభుత్వం సూచించింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్మాణాలు ఉండాలని లేదంటే బిల్లులు నిలిపివేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

క్షేత్రస్థాయిలోని అధికారులకు కూడా ఈ కొత్త గైడ్‌లైన్స్‌కు పంపించాలని కలెక్టర్‌లను ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అయ్యింది. అదే రోజు నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే ముగ్గు పోసి ప్రారంభించగా మరికొద్ది రోజుల్లోనే అవి బేస్‌మెంట్ స్థాయిని పూర్తి చేసుకోబోతు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొత్తగా విధి, విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది.

నూతన మార్గదర్శకాలు ఇలా….

ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫొటో తీయాలి. -ఆ ఫొటోను ఇందిరమ్మ యాప్‌లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. – ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. – రెండు గదులు, ఒక వంటగది, బాత్‌రూం ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. – ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. – వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. – పాత ఇంటిని ఆనుకొని గానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగా గానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికి గానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు. – ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. – ఒక ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి.
1,000 బేస్‌మెంట్ నిర్మాణాలకు

మొదటివిడత బిల్లులు

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 700 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తయినట్లు గృహనిర్మాణల శాఖ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని, మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,000 ఇళ్ల నిర్మాణాలు బేస్‌మెంట్ లెవల్‌కు రాగానే మొదటి దశ బిల్లులు విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

తొలి విడతలో స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హత కలిగిన వారినుంచి ప్రజాపాలన, గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాల వారిగా అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం తొలి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా తొలి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. తొలి విడతలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 72,045 మంది లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను మంజూరు చేశారు.

ప్రస్తుతం అర్హుల జాబితాను ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన అన్ని గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. తొలి విడతలో ఖాళీ స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే పేదలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో (ఫౌండేషన్) రూ.లక్ష, బేస్‌మెంట్, ఫిల్లర్స్ లెవల్లో రూ.1.25లక్షలు, స్లాబ్ లెవల్లో రూ.1.75లక్షలు, ఇతర నిర్మాణాలు పూర్తికాగానే రూ.లక్ష ఇస్తామని, ఆ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News