హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అటవీ పరిరక్షణ చట్టానికి నూతన మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయని, ఇకపై వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం అటవీ అనుమతుల ప్రక్రియ ఈ కొత్త నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఇన్స్‌పెక్టర్ జనరల్ (అటవీ) డాక్టర్ జి. త్రినాథ్‌కుమార్ అన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అటవీ అధికారులతో అరణ్యభవన్‌లో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అటవీ పరిరక్షణ చట్టం – 1980 (ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్)కు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మార్పు, చేర్పులపై డాక్టర్ త్రినాథ్‌కుమార్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అటవీ భూముల మళ్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూనే, కఠిన నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చిందని అన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్, చీఫ్ కన్జర్వేటర్, డిఎఫ్‌ఓ, నోడల్ అఫీసర్ సభ్యులుగా ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు.
సంబంధిత ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని అన్నారు. ఫారెస్ట్ యాక్టు కొత్త రూల్స్ పై ప్రతి అధికారికి పూర్తి అవగాహన, పట్టు ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు అడవులను రక్షిస్తూనే, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు అటవీ అనుమతుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అటవీ భూముల మళ్లింపు కోరే యూజర్ ఏజెన్సీ (సంబంధిత శాఖ) వైపు నుంచి ప్రతిపాదనలు సరిగా ఉండేలా చూడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ కోరారు. తాజా కేంద్రం నిబంధనల ప్రకారం జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) పాత్ర అటవీ అనుమతుల్లో మరింత కీలకం అవుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో పిసిసిఎఫ్ (ఎఫ్‌సిఎ ఎంసి పర్గెయిన్, అదనపు పిసిసిఎఫ్ ఎకె సిన్హా, అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.