Thursday, February 13, 2025

పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను(ఐటీ)నూతన బిల్లు గురువారం పార్లమెంట్ ముందుకు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం కాసేపటికే లోక్‌సభ మార్చి 10 కి వాయిదా పడింది. ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపనున్నారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి , 66 బడ్జెట్‌లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. అంతకు ముందు పన్ను చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా, ఇప్పుడు కొత్త పన్ను బిల్లులో622 పేజీల్లోనే 526 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూళ్లను పొందుపరిచారు.

పాతపన్ను చట్టం వల్ల పన్ను చెల్లింపుదార్లకు వ్యయాలూ పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి , సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు. ఈ చట్టాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 ప్రత్యేక సబ్ కమిటీలనూ ఏర్పాటు చేశారు. మొత్తం మీద కొత్త చట్టం సమీక్ష నిమిత్తం 6500 సలహాలను ఆదాయపన్ను విభాగం అందుకుంది. వీటన్నిటినీ పరిగణన లోకి తీసుకుని , కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందితే , తర్వాత స్థాయి సంఘం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఆమోదం లభిస్తే 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వస్తుంది.
టాక్స్ ఇయర్
అంతకు ముందు టాక్స్ పేయర్లకు పన్ను చట్టంలో ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసేసి కొత్తగా ఈ పన్ను బిల్లులో టాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకు వచ్చారు. ఇంకా చిన్నచిన్న వాక్యాలు, ఫార్ములాలు, టేబుళ్లతో అందరికీ అర్థమయ్యేలా సులభంగా చదవ గలిగేలా తీసుకొస్తున్నారు. అంతకు ముందటి చట్టంలో .. కిందటి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి, మదింపు సంవత్సరంలో పన్ను చెల్లించడం ఉంది. ఇప్పుడు కేవలం పన్ను ఏడాది అని మాత్రమే ఉంటుంది. అయితే కొత్త పన్ను బిల్లు వస్తుందంటే , టాక్స్ పేయర్లలో ఒకింత ఆందోళన నెలకొంది. పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో పన్ను శ్లాబుల్ని ఏమైనా సవరించారా ? అని ఆందోళన చెందుతున్నారు. అయితే బడ్జెట్ 2025లో ప్రతిపాదించినట్టుగా 202526 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి , పన్ను శ్లాబులు, పన్ను రేట్లు ఏం మారలేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News