నాగర్‌కర్నూల్ ః గ్రామ స్థాయిలో, వ్యవసాయ రంగంలో ఏదైనా ఒక నూతన ఆవిష్కరణ జరిగి ఉంటే వాటిని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో ఇంటింటా ఇన్నోవేటర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను నూతన చిట్కాలతో సులువుగా చేయగలిగే ప్రతీది ఆవిష్కరణగా భావించడం జరుగుతుందన్నారు. అలాంటి నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగంలో, గ్రామ స్థాయిలో అనేకం జరుగుతుంటాయని వాటిని తెలుసుకుని ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమానికి పంపించేందుకు 91006 78543 అనే వాట్సాప్ నెంబర్‌కు పంపించాలని సూచించారు. అన్ని ఆవిష్కణలను హైదరాబాద్‌లోని సాంకేతిక శాఖకు పంపించడం జరుగుతుందన్నారు.
అదే విధంగా ఉత్తమమైన ఆవిష్కరణలను ఆగష్టు 15న జరిగే స్వాతంత్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్‌లో ఒక స్టాల్ పెట్టి ఆవిష్కరణను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అందువల్ల ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి నూతన ఆవిష్కరణలపై చర్చించడం, ఆవిష్కరణ ప్రదర్శించడం, గ్రామ స్థాయిలో జరిగే నూతన ఆవిష్కరణలను ఇంటింటా ఇన్నోవేటర్‌లో నమోదు చేయించేందుకు యువత చొరవ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ నరేష్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, సిపిఓ భూపాల్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, ఐటి శాఖ నుంచి రమేష్ తదితరులు పాల్గొన్నారు.