Saturday, November 2, 2024

కొత్త భనవంలో కొత్త భాష!

- Advertisement -
- Advertisement -

new language in central vista parliament  దేశ ప్రజాస్వామ్య అత్యున్నత సంస్థ, ప్రజల అభీష్టాల, ఆశయాల ప్రతీక, వాటిని నెరవేర్చడానికి ఉద్దేశించిన ఆధునిక కోవెల, జన చైతన్య కేతనం పార్లమెంటు అనేక కొత్తదనాలకు లోను కానున్నది. ఇందులో మొదటిది నూతన భవనంలోకి మారనుండడం. రెండోది జాతీయ చిహ్నాన్ని ధరించడం. వీటితో బాటు సభ్యుల నాలుకలకు కత్తిరింపులు వేసే కార్యక్రమాన్ని సైతం ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టిందని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. ఐదేళ్ల కోసం యెన్నికయ్యే ప్రభుత్వాలు శాశ్వత ప్రాధాన్యమున్న చరిత్రాత్మక అంశాల జోలికి పోకుండా ఉండడం అవసరమైన లక్షణం. ఇటువంటి సున్నితమైన మర్యాదలను పాటించే సంప్రదాయం బొత్తిగా లేని మోడీ ప్రభుత్వం పార్లమెంటుకు నూతన భవనం సమకూర్చే పేరిట ఢిల్లీలో భారీ యెత్తు భవన విధ్వంసాన్నే తలపెట్టింది. బ్రిటిష్ హయాంలో 1926, 27లో ప్రారంభమై యెన్నో చారిత్రక సన్నివేశాలకు వేదిక అయిన ప్రస్తుత పార్లమెంటు భవనంలో వచ్చే సోమవారం నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాలు ఆఖరు సెషన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుగా ఆగమేఘాల మీద నిర్మితమైన కొత్త భవన సముదాయంలోని నూతన ప్రాసాదంలో వచ్చే శీతాకాల సమావేశాల నుంచి పార్లమెంటు కార్యక్రమాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక దశలో సుప్రీంకోర్టు నిలిపి వేసిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చుట్టూ వివాదం అల్లుకొన్న సంగతి తెలిసిందే. ఇరవై వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నాలుగున్నర లక్షల మీటర్లకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద ప్రస్తుత ఉపరాష్ట్రపతి భవనం సహా అనేక చరిత్రాత్మక కట్టడాలు వునికిని కోల్పోనున్నాయి. వీటిలో ముఖ్యమైనవి జాతీయ మ్యూజియం, ఇందిరా గాంధీ జాతీయ ఆర్ట్ సెంటర్, జాతీయ పురా పత్రాల (ఆర్కైవ్స్) అదనపు భవనం ఇలా గత చరిత్రకు నిలువెత్తు నిదర్శనాలను తనలో విలీనం చేసుకొని ఆవిష్కృతమవుతున్న నూతన పార్లమెంటు భవనంపై తాజాగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన అశోక స్తంభంలోని సింహ ముద్రలు వివాదాస్పదమయ్యాయి. సారనాథ్‌లో అశోకుడు నెలకొల్పిన స్తంభంలోని సింహాలు ప్రశాంత వదనాలతో వుండగా పార్లమెంటు నూతన భవనంపై నెలకొల్పిన సింహాల్లో రక్తదాహంతో కూడిన క్రౌర్యం కొట్టవస్తున్నదనే విమర్శ ప్రతిపక్షాల నుంచే కాకుండా న్యాయ, విగ్రహ జ్ఞానుల నుంచి వెలువడింది.

నూతన పార్లమెంటు భవనంపై నెలకొల్పిన అశోక స్తంభంలోని సింహాలు జాతీయ చిహ్నాన్నే అవహేళన చేసేవిగా వున్నాయని రాజ్యసభ సభ్యుడు, ప్రసార భారతి మాజీ సిఇవొ జవహర్ సర్కార్ వ్యాఖ్యానించారు. అసలు సింహం ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రశాంత, గంభీరమైనది కాగా పార్లమెంటు భవనంపై ప్రతిష్టించినది మోడీ ఉన్మత్త సింహమని అభిప్రాయపడ్డారు. 1950లో స్వతంత్ర భారతం నెలకొల్పుకొన్న అశోకుని సింహాలను ఆగ్రహమైనవిగా మార్చాల్సిన అవసరం యెందుకు కలిగిందని చరిత్ర పరిశోధకుడు ఎస్ ఇర్ఫాన్ హబీబ్ ప్రశ్నించారు. గాంధీ నుంచి గాడ్సే వరకు.. మన జాతీయ చిహ్నం రాజదర్పంతో, ప్రశాంతంగా ఉండే సింహాల నుంచి కోరలు సాచిన ఆగ్రహ సింహాల వరకు మారిందని, -ఇదే మోడీ నవ భారతం అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి నవ భారత నవ పార్లమెంటులో యెటువంటి భాష వాడకూడదో శాసిస్తూ నిషేధిత పదాల జాబితాను కూడా ఎన్‌డిఎ ప్రభుత్వం విడుదల చేసింది. పార్లమెంటులో ఉపయోగించకూడనివంటూ 62 పదాలతో లోక్‌సభ సచివాలయం యిటీవల వొక జాబితాను విడుదల చేసింది. వీటిలో ప్రధాని మోడీని విమర్శిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటలో ప్రయోగించిన జుమ్లా (అమలు చేయని వాగ్దానం) వంటివి వున్నాయి. ప్రధాని మోడీని జుమ్లా జీవి అని విమర్శించారు. అయితే మోడీ కూడా ప్రతిపక్షాలను ఆందోళన్ జీవులు ఆని యెత్తిపొడిచారు. ఇంకా నియంత, అసత్యవాది, సిగ్గుపడాలి వంటి సాధారణంగా వినియోగించే విమర్శ పదజాలాన్ని కూడా కొత్తగా విడుదల చేసిన పార్లమెంటులో వినియోగించకూడని పదాల్లో చేర్చారు.

దీనితో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అన్‌పార్లమెంటరీ పదాలంటూ యేటా లోక్‌సభ సచివాలయం విడుదల చేయడం ఆనవాయితీ అని, అంత మాత్రం చేత వాటిని, వాడకూడదనే నిషేధమేమీ లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వివరణ యిచ్చారు. తిట్టు నిషేధం. వ్యక్తిగత ద్వేషాన్ని తెలియజేసే పదాలు వాడకూడనివి. కాని ప్రజాస్వామ్యంలో పాలకుల నిరంకుశ పాలనపై గూడుకట్టుకున్న ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తూ అందుకు తగిన పదాలను, శక్తివంతమైన భాషను వినియోగించడం ప్రతిపక్షాలు తమ కర్తవ్యంగా భావిస్తాయి.అటువంటి భాషను ప్రయోగించడం వాక్ స్వాతంత్య్రం కిందకు, భావప్రకటన స్వీచ్ఛ కిందికి వస్తుందని చెప్పవచ్చు. ఉన్న మాటంటే వుడుక్కొనే వారే తమ చేతిలో గల నిరంకుశాధికార దండంతో వాటిని పార్లమెంటరీ యేతర, అన్‌పార్లమెంటరీ పదాలు అనగలరు. స్వేచ్ఛ వున్న చోటనే భాషా వృక్షం కొత్త చిగుళ్ళు తొడగ్గలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News