Sunday, December 22, 2024

గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు కొత్తరూపు

- Advertisement -
- Advertisement -

New look for rural sports grounds: Minister Srinivas Goud

రాష్ట్రంలో నూతన క్రీడా విధానం అమలు చేస్తాం
6 వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు
రాష్ట్ర క్రీడ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణించేలా రాష్ట్రంలో నూతన క్రీడా విధానం అమలు చేయనున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. క్రీడా రంగంలో తెలంగాణ అగ్రగామి నిలిచేలా, దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానం రూపొందించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సబితారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన విధానం రూపకల్పనపై (డ్రాఫ్ట్ పాలసీ) పలు దఫాలుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన కమిటీ సభ్యులు చర్చించి డ్రాఫ్ట్ పాలసీని రూపకల్పన చేశారు. మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నూతన విధానంపై రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడా మేధావులు, అర్జున, ద్రోణాచార్య అవార్డ్ గ్రహీతలు, ఒలంపియన్‌లు, రాష్ట్ర ఒలింపిక్ కమిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. దాదాపు 80 శాతం క్రీడాప్రాంగణాలు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ క్రీడల అభివృద్ధికి ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాంగణాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఆథ్లెటిక్, ఖో ఖో లాంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను 6 వేల గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో సదుపాయాలను కల్పించామని మంత్రి తెలిపారు. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన లో భాగంగా క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల కల్పన, క్రీడల అభివృద్ధిపై ప్రముఖ క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ప్రముఖ షూటింగ్ క్రీడాకారులు గగన్ నారంగ్, హాకీ క్రిడాకారులు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్‌కుమార్, ఆథ్లెటిక్ రమేష్ ,రాష్ట్ర ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యదర్శి జగదీష్‌యాదవ్‌ల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తీసుకున్నారు.

ఈ సమావేశంలో పాల్గొనని క్రీడా ప్రముఖులు, అవార్డు గ్రహీతలు తమ విలువైన సలహాలు, సూచనలను వెంటనే లిఖితపూర్వకంగా స్పోర్ట్స్ కాన్సుల్టెంట్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండికి అందజేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాల క్రీడా విధానాలను గోపిచంద్, గగన్ నారంగ్, ముఖేష్ కుమార్ ఆథ్లెటిక్ రమేష్, ఒలింపిక్ అసోసియేషన్ జగదీష్ యాదవ్‌లు పరిశీలించి, అధ్యయనం చేసి ప్రభుత్వానికి పలు విలువైన సూచనలు చేయాలని మంత్రి శ్రీనివా గౌడ్ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎస్. వేణుగోపాలచారి, స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, క్రీడా, పర్యాటకల శాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా, క్రీడాశాఖ సంయుక్త కార్యదర్శి కరోల్ రమేష్, క్రీడాధికారులు సుజాత, దీపక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News