Wednesday, January 22, 2025

బ్యాలెట్ ముద్రణకు కొత్త మిషన్లు సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఈసారి 299 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
28వేల మంది దివ్యాంగులు ఓటు వినియోగించుకోనున్నారు:  డిప్యూటీ సిఈవో సత్యవాణి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ వేగం చేసింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయటానికి కొత్త ప్రింటింగ్ మెషీన్లు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సిఈవో సత్యవాణి తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉండటంతో ముందుగానే ప్రింటింగ్ మొదలుపెట్టినట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 299 కొత్త పోలింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చామని ఓటర్ల సంఖ్య పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల అనుమతి కోసం ప్రపోజల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించినట్లు స్పష్టం చేశారు.

పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రపరచటానికి స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నీ వ్యవహారాలు వేగంగా చేస్తున్నట్లు ఎ, బి, సి, డి పద్దతిలో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 28 వేల మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వారికి కావాల్సిన సౌకర్యాలను పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని వాటిపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని వివరించారు.

ఈసారి నిర్వహించే ఎన్నికలకు 3504 నామినేషన్లు వచ్చినట్లు,  అందులో 606 తిరస్కరణకు గురికాగా, 608 మంది ఉపసంహరించుకోవడంతో ఎన్నికల బరిలో 2290 మంది ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సహాయక పోలింగ్ స్టేషన్లు 299, మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,655, హైదరాబాద్ పోలింగ్ స్టేషన్‌లకు ఓటర్ల సంఖ్య గరిష్ట పరిమితి 1550, మిగిలిన  ప్రాంతాల్లో 1500 ఉన్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News