Monday, December 23, 2024

కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

శాసనసభ జీరో అవర్‌లో శాసనసభ్యుల డిమాండ్

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం జీరో అవర్‌లో వివిధ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు పలు డిమాండ్లను ప్రస్తావించారు. ప్రధానంగా నూతనంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు మండలాలు, కొత్తగా గ్రామ పంచాయతీలను ప్రకటించాలని సభలో ప్రస్తావించారు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్నవాటితో పాటు నూతనంగా మరికొన్ని గ్రామాలు, మండలాల పేర్లను వారు ప్రస్తావించి.. వాటిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులను క్రమబద్దీకరించాలని, వివిఓలను, అంగన్‌వాడీ ఉద్యోగులను, అశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు పరిశీలించాలని కోరారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బి రహదార్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని సభ్యులు కోరారు. ఈ మేరకు మంత్రులు సమాధానం ఇచ్చారు.

రామడుగు మండలంలోని గోపాలరావుపేట, గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రస్తావించారు. నారాయణపేట నియోజకవర్గంలో మరో మూడు నూతన మండలాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. కోయిలుకొండ మండల పరిధిలోని గార్లపాడు, దామరగిద్ద మండలంలోని కానుకూర్తి నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామాలను చుట్టుపక్కల గ్రామాలతో కలిపి నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాద్రాది భువనగిరి జిల్లాలోని ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వవిప్ గొంగిడి సునీత కోరారు. చేర్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి అంశాలతో పాటు భూముల క్రమబద్దీకరణపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

గ్రామ పంచాయతీ, వివిఓలను క్రమబద్దీకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ రోడ్లు అభివృద్ధికి నిధులు కేటాయించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కోరారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య సభలో ప్రస్తావించారు. జహీరాబాద్ న్యాలకల్ మండలంలోని తండాలను గ్రామ పంచాయతీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. అనంతగిరి హిల్స్ అభివృద్ధి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మహాత్మగాంధీ ఎత్తిపోత పథకంలో అనుబంధ కాలువ నిర్మాణం, భూసేకరణ రైతులకు నిధుల జాప్యంపై ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రస్తావించారు. ఇల్లెందు నియోజకవర్గంలో భూసేకరణలో కొంత భూమిని కోల్పోయిన రైతులకు సంబంధిత మొత్తం భూమికి రైతుబంధు నిలిపివేశారని ఎమ్మెల్యే హరిప్రియ ప్రస్తావించారు. పలు అంశాలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News