మరిపెడః ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నవ దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. పెండ్లి అయిన మూడు నెలలకే భార్యభర్తలు మృతి చెందడంతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని డిఎస్‌ఆర్ జెండాల తండా గ్రామ పంచాయితీ శివారులోని కోమటి కుంటతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్, సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం మరిపెడ పట్టణ కేంద్రంలోని రామావిలాస్ వీధికి చెందిన గోగునాద్ గోపి, సునిత దంపతుల కుమార్తె అంజలి (22)ని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగే గ్రామానికి చెందిన తునగర్ అనంతరాం సింగ్ కుమారుడు తునగర్ నారాయణ సింగ్ (24)లకు ఈ ఏడాది మార్చి 9న వివాహం జరిగింది.
మృతుడు తునగర్ నారాయణ సింగ్ హైదరాబాద్‌లో సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తుండటంతో భార్య భర్తలు అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అల్లుడికి అత్తగారు పెట్టిన ద్విచక్ర వాహనానికి కొత్త నెంబర్ వచ్చిందని మామ గోపి తెలిపాడు. ద్విచక్రవాహనానికి మహబూబాబాద్ ఆర్‌టిఏ కార్యాలయంలో కొత్త నెంబర్ వేయించుకోవడంతో పాటు అత్తగారి ఇంటి వద్ద రెండు రోజులు ఉండి పోదామని అల్లుడు నారాయణ సింగ్ కొత్త ద్విచక్ర వాహనంపై భార్య అంజలిని ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి మరిపెడలోని అత్తగారికి బయలు దేరి వస్తున్నారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని డిఎస్‌ఆర్ జెండాల తండా గ్రామ పంచాయితీ శివారులోని కోమటికుంట తండా సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో భార్యభర్తలు ద్విచక్ర వాహనంపై నుంచి నడి రోడ్డుపై పడి తీవ్ర గాయాలై నవ దంపతులు అక్కడికక్కడే మృతి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మరిపెడ ఎస్‌ఐ పవన్ కుమార్ సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెండ్లి అయి మూడు నెలలు తిరక ముందే నవ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇరువురి మృత కుటుంబాలో తీవ్ర విషాదం నెలకొంది.
మృత కుటుంబానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శ
రోడు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, వైస్ ఎంపిపి గాదె అశోక్‌రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న తదితరులు కలరు.