Monday, December 23, 2024

రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు చేరిక ఎప్పటికో…

- Advertisement -
- Advertisement -

చిన్నారులు నమోదు కోసం ఎదురుచూపులు
ఐదేళ్ల కితం దరఖాస్తు చేసిన పట్టించుకునే పరిస్ధితి లేదు
నాలుగు కుటుంబ సభ్యులున్న ఇద్దరికే రేషన్ సరుకులు
ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు అందని ఆరోగ్య శ్రీ సేవలు

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఇటీవల కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసింది. కానీ కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారి పేర్లు ఆమోదించడం లేదు. ఈప్రక్రియను చేపట్టడం లేదు. సుమారు ఏడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో కొత్తగా వివాహం చేసుకున్న వారి పేరు కుటుంబ సభ్యుల్లో చేరడం లేదు. వివాహం జరగ్గానే అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యుల నుంచి కుమార్తె పేరు తొలగించి, అత్తగారి ఇంట్లో చేర్చుకోవాలని సూచించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.

తొలగింపునకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పేరు చేర్చడంతో మాత్రం అవకాశం కల్పించడం లేదు. పిల్లలు పుట్టాక వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటున్న వారికి నిరాశే ఎదురువుతోంది. ఏడాది నెల కితం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వాటిలో 30 శాతం మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు చేశారు. పౌరసరఫరాల అధికారులు 360డిగ్రీలో ఎంపిక చేయడంతో చాలా దరఖాస్తులను పక్కకు పెట్టారు. 2, 35, 675 కుటుంబాలు దరఖాస్తులు రాగా, వాటిలో 1,18లక్షలు వివిధ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 60వేల దరఖాస్తులను అనర్హతగా గుర్తించారు. దీంతో కొత్త పెళ్లిన కుటుంబాలు, ప్రైవేటు ఉద్యోగులు, బలహీన వర్గాల కోటాలో ఇళ్లు పొందిన వారి దరఖాస్తులే ఎక్కువగా పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య లక్షకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. తొలగింపు విషయంలో ఉన్న ఉత్సాహం పేర్ల నమోదు అధికారులు ఎందుకు చూపడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు పొందడం, ఆరోగ్య సమస్యలుంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లితే ఆరోగ్య శ్రీ వర్తించకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కార్డుల్లో ఇద్దరు కుటుంబ పెద్దలు పేర్లు మాత్రమే ఉన్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు తొలగించిన వారి స్దానంలో పేర్ల నమోదు చేస్తే పెద్ద భారం పడదని చెబుతున్నారు. జిల్లా వారి దరఖాస్తుల వివరాలు హైదరాబాద్ జిల్లాలో 99,668 దరఖాస్తులు రాగా, 43, 604 తిరస్కరణ, రంగారెడ్డి జిల్లాలో 74,254 దరఖాస్తులు 38,766 తిరస్కరణ, మేడ్చల్ జిల్లాలో 61,773 దరఖాస్తులు రాగా 36,400లను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దాదాపు 40 శాతం దరఖాస్తులు ఎంపికయ్యే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు భావిస్తున్నారు. పేద ప్రజలు రేషన్‌కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, తమ వద్దకు వస్తే అర్హులకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News