న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ వివాదం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ కొత్త భవనాన్ని ఈనెల 28న రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించక పోవడం ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది సీఆర్ జయా సుఖిన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అలాగే ప్రధాని సలహాపైనే ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తుంటారు.
గవర్నర్లు, సుప్రీం కోర్టు , హైకోర్టు న్యాయమూర్తులను, కాగ్, యూపిఎస్‌సి ఛైర్మన్, సీఈసీ, ఫైనాన్షియల్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లను , రాష్ట్రపతి నియమిస్తారు. ఇన్ని బాధ్యతలతో ముడిపడి ఉన్న రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది సుప్రీం లెజిస్లేటివ్ సంస్థ అని, పార్లమెంట్‌లో రాష్ట్రపతి, ఉభయసభలు కూడా ఉంటాయని, ఉభయ సభలకు సమన్లు జారీ చేయడం, ప్రొరోగ్ చేయడం, వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయని పిటిషన్‌లో వివరించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో లోక్‌సభ సెక్రటేరియట్, కేంద్ర హోం శాఖ , న్యాయశాఖలను కూడా పార్టీలుగా చేర్చారు