Monday, December 23, 2024

దేశాధిపతికి అవమానం

- Advertisement -
- Advertisement -

దేశానికి అధ్యక్ష తరహా పాలనను కోరుకునే ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా పరిపాలించాలని ఆశిస్తున్నారా? అందుకు మౌలిక ప్రజాస్వామిక సూత్రాలను, మర్యాదలను కాలరాయదలిచారా? ఆయన వ్యవహార శైలిని గమనించేవారిలో ఇటువంటి ప్రశ్నలు మెదులుతాయి. ఆయన తన నిర్ణయాలతో ఈ ప్రశ్నలకు ఔనని సమాధానం చెబుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాతకంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28 ఆదివారం నాడు స్వయంగా తానే ప్రారంభించదలచడం ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాంగపరమైన పద్ధతిని ప్రధాని ఉద్దేశపూర్వకంగా పూర్తిగా విస్మరించారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకొన్న దేశంలో ఆమెను పిలవకుండా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడమంటే ఆమె సామాజిక వర్గాన్ని, దేశ జనాభాలో అత్యధిక శాతంగా వున్న ఎస్‌టి, ఎస్‌సి, బిసి జనాభాను అవమానించడమేనని అనిపించడం ఎంత మాత్రం ఆక్షేపించదగినది కాదు. పార్లమెంటు రాష్ట్రపతి ఆధీనంలో వుంటుంది.

అటువంటప్పుడు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకపోడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుచేతనే ఆ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడానికి 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా నిర్ణయం తీసుకొన్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాయి. భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగానే జరిపించాలని ముందుగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దానిని పెడచెవిన పెట్టి ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే జరిపించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఆ ప్రకారం రాష్ట్రపతిని ఆహ్వానించకుండానే ఆ కార్యక్రమాన్ని జరిపించదలచాయి. ప్రధాని మోడీకి అవధులు మీరిన ప్రచార కాంక్ష వున్న మాట వాస్తవం. దేశం తన కనుసన్నల్లో, తన మునివేళ్ళ మీదనే నడుస్తున్నదని చాటుకోడం ఆయనకు ఇష్టం. అందుచేత తన మంత్రివర్గ సభ్యులను మరుగున వుంచి అన్ని సందర్భాల్లోనూ తానే కనిపిస్తుంటారు. వందే భారత్ రైళ్ళకు పచ్చజెండా ఊపే ఉత్సవాలనూ తానే జరిపిస్తారు గాని ఆ శాఖ మంత్రిని కనిపించనివ్వరు. ఇప్పుడు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభం విషయంలోనూ దానినే పాటిస్తున్నారు.

ఇలా చేయడం ద్వారా ఆయన ప్రజాస్వామ్యం ఆత్మను హరించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య ఆలయమే కాకుండా దాని గర్భగుడి కూడానని అవి పేర్కొన్నాయి. కేంద్రానికి ఒక పార్లమెంటు వుండాలని దానికి పైన రాష్ట్రపతి, రెండు సభలు (రాజ్యసభ, లోక్‌సభ) వుండి తీరాలని రాజ్యాంగం 79వ అధికరణ చెబుతున్నదని, భారత దేశంలో రాష్ట్రపతి రాజ్యాధినేత మాత్రమే కాకుండా పార్లమెంటులో అంతర్భాగమని, దానిని సమావేశపరచడం, ప్రోరోగ్ చేయడంతోబాటు దానినుద్దేశించి ప్రసంగం కూడా చేస్తారని, రాష్ట్రపతి ఆమోదించితేనే బిల్లులు చట్టాలవుతాయని ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రపతి పాత్ర, ప్రమేయం లేకుండా పార్లమెంటు పని చేయజాలదని అటువంటి రాష్ట్రపతిని పిలవకుండా నూతన భవన ప్రారంభోత్సవం జరిపించడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు తమ లేఖలో పేర్కొన్నాయి. 1975లో పార్లమెంటు అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారని, 1987లో లైబ్రరీ భవనానికి రాజీవ్ గాంధీ పునాది రాయి వేశారని మీ ప్రభుత్వాధినేతలు అలా చేయగాలేనిది, ప్రస్తుత ప్రభుత్వాధినేత పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడంలో గల దోషం ఏమిటని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఎదురు ప్రశ్న వేశారు.

ఇది నక్కకు నాగలోకానికి ముడిపెట్టడమే. మొత్తంగా నూతన భవనానికి ప్రారంభోత్సవం జరపడానికి, పాత భవనానికి కొనసాగింపుగా జరిపిన నిర్మాణాలను ప్రారంభించడానికి తేడా సుస్పష్టం. రూ. 13000 కోట్ల ఖర్చుతో నిర్మించుకొన్న పార్లమెంటు భవనానికి మనం జాతి పెద్దగా, రాజ్యాంగాధినేతగా గౌరవించే రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం జరిపించడం ఎంత గొప్పగా వుంటుందో చెప్పనక్కర లేదు. తమ అతిశయం ముందు అదంతా బలాదూరని బిజెపి పాలకులు చాటుకొంటున్నారు. పాత భవనాన్ని బ్రిటీష్ పాలకులు 1927లో నిర్మించారు. ప్రారంభం కానున్న కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని మోడీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవనం స్వావలంబన సాధించుకొన్న భారత దేశంలో భాగమని ప్రకటించారు. ఈ భవనాన్ని టాటా ప్రాజెక్టు నిర్మించింది. భవన వాస్తు శిల్పి బిమల్ పటేల్‌ను, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాను, పార్లమెంటు ఉభయ సభల సభ్యులను, లోక్‌సభ స్పీకర్‌ను, లోక్‌సభ మాజీ స్పీకర్లను, రాజ్యసభ మాజీ చైర్మన్‌ను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇంకెంతో మంది అతిథులను ఆహ్వానించి జరుపుకొంటున్న ఈ జాతీయ ఉత్సవానికి జాతి రాజ్యాంగ అధినేత రాష్ట్రపతిని పిలవకపోతే అంతకు మించిన అపరాధముంటుందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News