Friday, January 24, 2025

సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్తు పాలసి

- Advertisement -
- Advertisement -

సంక్షేమమే లక్షంగా విద్యుత్తు పాలసి
రైతాంగ ప్రయోజనాలకే పెద్దపీట
పేదల బతుకుల్లో వెలుగులు నింపే పాలసి
సంక్షోభం నుంచి విద్యుత్తు రంగం పరిరక్షణ
జెన్కో పరిధిలో జల విద్యుత్తు కేంద్రాలు
ఖరీదైన థర్మల్ విద్యుత్తుకు చెల్లుచీటి
సోలార్, పవన విద్యుత్తుకు ప్రోత్సాహం
ఎన్నికల తర్వాత అమల్లోకి కొత్త పాలసి

మన తెలంగాణ /హైదరాబాద్: పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన విద్యుత్తు రంగాన్ని పరిరక్షించుకొంటూనే… వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా ఉండేలా… పేదల బతుకుల్లో వెలుగులు నింపుతూ… వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహమిచ్చే విధంగా సరికొత్త విద్యుత్తు పాలసిని ప్రవేశపెట్టడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ కసరత్తులనే చేస్తోంది. అంతేగాక విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని పెంచుకొంటూనే అత్యంత ఖరీదైన థర్మల్ విద్యుత్తుపైన భారాన్ని క్రమేపీ తగ్గించుకొంటూ కారుచౌకగా లభించే జల విద్యుత్తు, సోలార్ పవర్, పవన విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యుత్తు పాలసిని తయారు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

మహోన్నతమైన లక్షంతో విద్యుత్తు పాలసిని తయారు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని, పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గృహ విద్యుత్తు రంగంలో నెలకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా సరఫరా చేయాలన్నా, వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయాలన్నా, కాలక్రమేణా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు తగినట్లుగా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని పెంచుకోవడానికి వీలుగా నూతన విద్యుత్తు పాలసీ తయారవుతోందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక విద్యుత్తు కొనుగోళ్ళను క్రమక్రమంగా తగ్గించుకొంటూ తెలంగాణ రాష్ట్ర జెన్కో పరిధిలోనే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను పెంచుకోవాలని, అలాగైతే విద్యుత్తు రంగం ఆర్ధికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా… అప్పుల ఊబిలో నుంచి విద్యుత్తు రంగాన్ని బయటపడేయాలన్నా సాధ్యమవుతుందని, అలా కాకుండా నేడున్న లోపభూయిష్టమైన విధానాలనే కొనసాగిస్తే కేవలం కరెంటు కొనుగోళ్ళపైనే ఆధారపడాల్సి ఉంటుందని, ఇలా చేస్తే ప్రజా ధనం విద్యుత్తు కొనుగోళ్ళకే వ్యయం చేయాల్సి ఉంటుందని, ఈ దుర్భర పరిస్ధితుల నుంచి ఈ వ్యవస్థను కాపాడుకోవాలన్నా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమం కొనసాగాలన్నా విద్యుత్తు రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యుత్తు పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖామంత్రి కూడా అయిన భట్టి విక్రమార్కలు దిశానిర్ధేశ్యం చేశారని, వారిచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని పాలసీని తయారుచేసే పనిలో ఉన్నామని ఆ అధికారులు వివరించారు. అందులో భాగంగానే ఎన్‌టిపిసి రెండోదశలో ఉత్పత్తి అయ్యే 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్తును కొనుగోలు చేసే విషయంలో అనేక తర్జనభర్జనలు చేశామని, సుధీర్ఘమైన సమీక్షలు చేసిన తర్వాతనే ఎన్‌టిపిసి నుంచి కరెంటును కొనుగోలు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చామని వివరించారు.

ఎన్‌టిపిసి నుంచి ఈ 2400 మెగావాట్లలో ఒక్కో యూనిట్ కరెంటును 5.90 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంటుందని, కొత్త ప్లాంట్ నిర్మాణాలు పూర్తయ్యే నాటికి ఈ ధర కాస్తా 5.90 రూపాయల నుంచి ఏకంగా 9 రూపాయలకు చేరుతుందని, ఇంతటి పెనుభారాన్ని మోసే పరిస్థితులు లేవని, అందుకే వద్దనుకొంటున్నామని వివరించారు. అసలే రాష్ట్ర విద్యుత్తు రంగం ఏకంగా 85 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇక ఎన్‌టిపిసి నుంచి ఈ 2400 మెగావాట్ల కరెంటును కొనుగోలు చేయడానికి పిపిఎలపై సంతకాలు చేస్తే మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్లుగా ఉంటుందని ఆ అధికారులు అన్నారు. ఇవే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కూలంకషంగా వివరించామని, ఇక దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది వారిద్దరేనని ఆ అధికారులు వెల్లడించారు. అంతేగాక బహిరంగ మార్కెట్‌లో ఎన్‌టిపిసి కంటే తక్కువ ధరకే విద్యుత్తు దొరుకుతోందని, ఒక్కో యూనిట్ కరెంటు కనిష్టంగా 2 రూపాయల నుంచి 4 రూపాయలకే లభిస్తోందని, అటువంటప్పుడు ఎక్కువ ధరకు ఎన్‌టిపిసి నుంచి ఎందుకు కొనుగోలు చేయాలి? అని ఆ అధికారులు ఎదురు ప్రశ్నించారు.

అంతేగాక ఎన్‌టిపిసితో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవి 25 ఏళ్ళపాటు అమలులో ఉంటాయని, తెలంగాణ ప్రజలపై మోయలేనంత ఆర్ధిక భారం పడుతుందని, అందుకే ఎన్‌టిపిసి రెండోదశ విద్యుత్తు ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని, తక్కువ ధరకు రాష్ట్రానికి విద్యుత్తు సరఫరా చేసే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అనేకం ఉన్నాయని వివరించారు. ఖరీదైన థర్మల్ విద్యుత్తు జోలికి వెళ్ళకుండా అత్యంత చౌకగా ఉండే సౌరవిద్యుత్తు, జల విద్యుత్తు, పవన (గాలి) విద్యుత్తు, పంప్డ్ స్టోరేజి విద్యుత్తు వంటి ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కరెంటు అవసరాలన్నీ తీరుతాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 15,623 మెగావాట్ల విద్యుత్తు పీక్‌లోడ్ ఉంటుందని, ఇది కాస్తా 2032వ సంవత్సరం నాటికి ఏకంగా 27,059 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లుగా వివరించారు.

సౌర విద్యుత్తును ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొందని, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రంలోని విద్యుత్తు అవసరాలన్నీ సౌర విద్యుత్తుతో తీర్చుకోవాలని, ఇలా చేయడం మూలంగా మిగతా మార్గాల నుంచి వచ్చే ఖరీదైన విద్యుత్తు అవసరం భారీగా తగ్గుతుందని, అందుకే రాష్ట్రంలోని అన్ని 33/11 కెవి సబ్‌స్టేషన్ల పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు కొత్త విద్యుత్తు పాలసీలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా వివరించారు. అంతేగాక అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను నెలకొల్పాలని భావిస్తున్నామని చెప్పారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే అన్ని ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులను భాగస్వాములను చేయాలని ప్రతిపాదన కూడా ఉందన్నారు.

రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లతో పాటుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో 6732 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయని అంచనాలు వేశామని వివరించారు. తక్కువ ధరతోపాటుగా లాభసాటి వ్యాపార మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ప్రతి అంశాన్నీ కొత్త పాలసీలో పొందుపరుస్తామని తెలిపారు. అంతేగాక హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయని, ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ వ్యూహంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల న్యూఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపారని వివరించారు. ఇలా కొత్త విద్యుత్తు విధానంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని, వివిధ రంగాల నిపుణులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలన్నీ స్వీకరించాలని, దాంతోపాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ విచారణలు కూడా జరిపే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వివరించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త విద్యుత్తు పాలసిపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News