వచ్చేనెల నుంచి ’మీ సేవ’ లో అప్లికేషన్లు
మనతెలంగాణ/హైదారబాద్: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల్లో అర్హత గత వారికి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల కోసం ఫిబ్రవరి నెలాఖరు లోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగం గానే ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా ద్వారా అప్లై చేయొచ్చు.అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీ లకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్క్రూటినీ చేయడం త్వరగా అయ్యే పనికాదు. దీని వల్లే రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ సేవా ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు , మార్పులు చేర్పులకోసం కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు చెబుతోంది.