పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు
ముందుగా చేర్పులు, మార్పులకే ప్రాధాన్యత
కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు
అర్హులైన వారిని ఎంపిక చేస్తామంటున్న పౌరసరఫరాల శాఖ
హైదరాబాద్: నగరంలో కొత్త రేషన్‌కార్డులు గతంలో దరఖాస్తులు చేసుకునేవారికే మంజూరు చేస్తామని, ఇప్పుడు చేసుకునేవారికి అవకాశం లేదని పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. ఆహారభద్రత కార్డులు సిఎం కెసిఆర్ మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు అందజేయగా, తరువాత కార్డులు గురించి ఎక్కవ ప్రస్తావరాలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొనడంతో జిల్లా అధికారులు గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లీయర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు రోజుల కితం క్యాబినెట్ సబ్‌కమిటీ రేషన్‌కార్డులపై చర్చించి పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేయాలని సూచించడంతో ఆదిశగా దరఖాస్తులు పరిశీలన చేస్తున్నట్లు డివిజన్ పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు.
కార్డులో కుటుంబ సభ్యులు పేరు చేర్చుట, మృతి చెందిన వారి పేర్లును తొలగింపు ముందుగా చేపట్టి, తరువాత గతంలో రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తామని, తాజాగా చేసుకునే వాటిని మరోసారి ప్రభుత్వం అనుమతి ఇస్తే మంజూరు చేస్తామని చెబుతున్నారు. సర్కిల్ వారీగా దరఖాస్తులు అంబర్‌పేట 5386, చార్మినార్ 19,386, నాంపల్లి 2863, యాకుత్‌పురా 16,612, మెహిదిపట్నం 19,168, ఖైరతాబాద్ 12,106, సికింద్రాబాద్ 5542, బేగంపేట 5267, బాలానగర్ 36,894, సరూర్‌నగర్ 22,995, ఉప్పల్ 36,423 దరఖాస్తులు రాగా వచ్చినట్లు వీటిలో కొన్ని దరఖాస్తులు గతంలో పరిశీలన చేసి ఉన్నతాధికారులు పంపగా, ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే జాబితా పంపాలని సూచించారు. దీంతో అవి పక్కకు పెట్టమన్నారు. తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశించడంతో పాత దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామాలో అందుబాటులో ఉన్నారా వంటి అంశాలను ఆరా తీస్తూ లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో పడట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
కార్డుల పేరుతో దళారులు దోపిడీ…
ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటన చేయడంతో స్దానిక బస్తీ, కాలనీల్లో ఉండే కొంతమంది చోటా రాజకీయ నాయకులు అమాయక ప్రజలను మోసం చేస్తూ తమకు రూ. 5వేలు ఇస్తే రెండు వారాల్లో రేషన్‌కార్డు వచ్చేలా చూసుకుంటామని మాయమాటలు చెబుతూ జేబులు నింపుకునే దందాలో పడ్డారు. ఇటీవల జిల్లా కలెక్టరేట్ పలువురు పేదలు వచ్చి తమ ప్రాంతంలో ఉండే నాయకులు ముడుపులిస్తే రేషన్‌కార్డు వస్తుందని మభ్యపెడుతున్నారని, నగదు చేతిలో పడ్డ తరువాత తప్పించుకుంటున్నారని ఉన్నతాధికారులు పిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారులు కార్డుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని, తామే స్వయంగా పరిశీలన చేసి, అర్హులైన వారిందరికి కార్డులు మంజూరు చేస్తామని పేర్కొంటున్నారు. డబ్బులు తీసుకుని మోసం చేసేవారిపై స్దానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.