మెరుగైన రవాణా కోసం అధునాతన బస్సులు
రాష్ట్రంలో తొలిసారిగా వాడకంలోకి తీసుకొస్తోన్న టిఎస్ ఆర్టీసి
ఎసి స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం.
సోమవారం మంత్రి పువ్వాడ చేతుల మీదుగా ఉదయం ప్రారంభం
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి అధునాతన స్లీపర్ బస్సులను హైటెక్ హంగులతో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి విడతగా 16 ఎసి బస్సులు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయి. ప్రైవేటు బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం (నేటి) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను లాంఛనంగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్నారు.
కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడుపనుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఎసి స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఎసి స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు ఆధునిక హంగులతో కొత్త ఎసి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసి నిర్ణయించింది. నాన్ ఎసి స్లీపర్ బస్సుల మాదిరిగానే ఎసి స్లీపర్ బస్సులకు ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది.
ఆధునిక సాంకేతికత అదనం
కొత్త ఎసి స్లీపర్ బస్సుల్లో ఉచిత వై-ఫై సదుపాయంతో పాటు ఆధునిక సాంకేతికత అదనంగా అమర్చారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని సైతం కల్పించారు. వాటిని టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే వారు వెంటనే పానిక్ బటన్‌ను నొక్కగానే టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు. 12 మీటర్ల పొడవు గల ఎసి స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జీంగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు.
ఎల్‌ఈడీ డిస్ ప్లే బోర్డులు
ఈ బస్సుల్లో గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనక ఎల్‌ఈడీ డిస్ ప్లే బోర్డులుంటాయి. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఆధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్‌డిఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం ఈ కొత్త బస్సుల్లో ఏర్పాటు చేశారు.