Saturday, December 21, 2024

కాంగ్రెస్‌లో చేరే వారికి సరికొత్త నిబంధన !

- Advertisement -
- Advertisement -
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
గెలిచిన తరువాత పార్టీ మారకుండా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పిన తెలంగాణ కాంగ్రెస్

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో చాలామంది వేరే పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం చాలామంది పార్టీలో చేరుతున్నారని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త నిబంధన పెట్టినట్లుగా సమాచారం. ఈ సారి అసెంబ్లీ టికెట్ కావాలంటే బాండ్ రాసివ్వాలని కాంగ్రెస్ షరతు పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారను. ఒక వేళ మారాల్సి వస్తే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాస్తేనే టికెట్లు ఇస్తామని టిపిసిసి ఖరాఖండీగా చెబుతున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు బాండ్ పేపర్ రాసిస్తేనే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని కూడా టిపిసిసి స్పష్టం చేసినట్టుగా తెలిసింది.

హైకమాండ్ ఆదేశాల మేరకే…
హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ బాండ్ పేపర్ పద్ధతిని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు వెళ్లాయని, బాండ్ పేపర్ పద్ధతిపై స్పష్టమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం సూచించినట్టుగానే టి -కాంగ్రెస్ నాయకులు సైతం ఈ బాండ్ పేపర్ పద్ధతికి ఓకే చెప్పినట్లుగా సమాచారం.

జీహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనే తెరపైకి…
కాంగ్రెస్ పార్టీలో బాండ్ పేపర్ విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టలేదని కొందరు నాయకులు చెబుతున్నా, జీహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కార్పొరేటర్ టికెట్ల ఆశించిన వారు కూడా బాండ్ పేపర్లపై సంతకం పెట్టినట్లుగా సమాచారం. అయితే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2 డివిజన్లు మాత్రమే. దీంతో బాండ్ పేపర్ల వ్యవహారం బయటకు రాలేదు. అయితే ఈ సారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా దీనిని అమలు చేయాలని టిపిసిసి నిర్ణయించినట్టుగా తెలిసింది.

ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు
ఎవరైనా బాండ్ పేపర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని టిపిసిసి ఆ బాండ్‌లో స్పష్టంగా రాయించుకుంటోంది. ఈ బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. కేవలం కొత్తగా పార్టీలో చేరే వారికే కాకుండా పాత నాయకులకు కూడా ఈ బాండ్ పేపర్ పద్ధతి అమల్లో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు క్యూ కడుతున్నారు. కొంత మంది ఇతర పార్టీలో టికెట్ రాదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇలాంటి వారు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ మారొద్దన్న ఉద్దేశంతోనే బాండ్ పేపర్ పద్ధతిని తీసుకొచ్చినట్లు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు తెలపడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News