హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇందులో ఫాస్ట్‌ట్యాగ్ ప్రోటోకాల్స్ నుంచి ట్యాక్స్ పాలసీల వరకు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా ప్రభావితం చేస్తాయి. అలాగే కొత్త నెల ప్రారంభంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే ఇతర ఫైనాన్షియల్ రూల్స్ సైతం మారుతుంటాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల నుంచి పీఎఫ్ ఖాతా వరకు పలు కీలక అంశాల్లో మార్పులు జరగబోతున్నాయి.
ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగిస్తున్న వాహనదారులు తప్పనిసరిగా మార్చి 31, 2024లోపు తమ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఏప్రిల్ 1 తర్వాత ఫాస్ట్ ట్యాగ్ ఖాతా నిలిపిపోయే ప్రమాదం ఉంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు మార్చి 31, 2024తో ముగుస్తోంది. ఎవరైతే లింక్ చేయడంలో విఫలమవుతారో వారి పాన్ కార్డు డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 1, 2024 తర్వాత పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలనుకుంటే భారీగా పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు. ఇప్పటికే రూ.1000 పెనాల్టీతో పాన్- ఆధార్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఐటీ శాఖ. ఈ పెనాల్టీలు తప్పించుకోవాలంటే గడువులోపు పాన్- ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.