కొన్ని గంటల్లో 2025 ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నాము. ఈరోజుతో 2024 సంవత్సరం బై చెప్పేస్తున్నాం. కొత్త సంవత్సరంతో అనేక నియమాలలో మార్పులు ఉంటాయి. ఇవి నేరుగా సామాన్యుడి జేబు పై చిల్లు పడుతుంది. వీటిలో LPG సిలిండర్ ధరల నుండి UPI చెల్లింపుల కోసం కొత్త నిబంధనల వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ వార్త ద్వారా వచ్చే ఏడాది నుంచి ఎలాంటి నియమాలు అమల్లోకి వస్తాయో తెలుసుకుందాం.
1. గ్యాస్ సిలిండర్ ధర
ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ప్రతి నెల 1వ తేదీన అప్డేట్ చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచే అవకాశం కనిపిస్తోంది.
2. ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలలో మార్పులు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సి) ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనలు జనవరి నుంచి మారనున్నాయి. మెచ్యూరిటీకి ముందు తమ డిపాజిట్ల ఉపసంహరణకు సంబంధించి ఎఫ్డి చేసే వారికి ఆర్బీఐ ఇప్పుడు ఉపశమనం ఇచ్చింది. అంతేకాకుండా.. నామినీలకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చారు.
3. UPI 123 చెల్లింపు లావాదేవీ పరిమితి
ఆర్‌బీఐ యూపీఐ 123 పే కోసం లావాదేవీ పరిమితి పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2025 నుండి అమల్లోకి రానున్నది. గతంలో గరిష్ట లావాదేవీ పరిమితి రూ. 5,000 ఉండగా, జనవరి 1, 2025 నుంచి రూ.10,000కి పెంచింది.
4. రైతులకు శుభవార్త
ఆర్బీఐ రైతులకి శుభవార్త చెప్పింది. జనవరి 1, 2025 నుంచి రైతులు గ్యారెంటీ లేకుండా దాదాపు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. అయితే, గతంలో ఈ పరిమితి రూ.1.60 లక్షలుగా ఉండేది.
5. కార్ల ధరలు పెంపు
ప్రముఖ మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, కియా వంటి తయారీదారులు తమ వాహనాల ధరలను 2 నుండి 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1, 2025 నుండి వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో కార్ల ధరలు పెరుగుతాయి.