Monday, December 23, 2024

అద్భుతం.. ఆధునిక పాలనా సౌధం

- Advertisement -
- Advertisement -

‘విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో నూతన సచివాలయం చూపరులను ఆకట్టుకుంటోంది. 4వేల కార్మికులతో 26 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాం. కరోనా అవరోధాలు కలిగించినా విజయవంతంగా అధిగమించాం. రాజస్థాన్ దోల్‌పూర్ ఎర్రటి ఇసుకరాయిని నిర్మాణంలో వినియోగించాం. అందుకే సచివాలయం అంత అందంగా కనిపిస్తున్నది’ అని భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో నూతన సచివాలయం ప్రారంభం జరగనున్న నేపథ్యంలో ఆయన మన తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. అందులో అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ దీపాలతో పాలనా సౌధం ధగధగలాడుతోంది. విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో చూపర్లను ఆకట్టుకుంటోంది. నూతన సచివాలయ భవనం రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ల్యాండ్ స్కేపింగ్ సహా ఇతరత్రా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్నాయి. ప్రధాన భవనానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. రాజసం ఉట్టిపడుతోన్న ఈ ఆధునిక భవంతి చూపరులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన స్తంభాలు, భారీ గుమ్మటాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విశాలమైన పోర్టికోతో ఉన్న ప్రధాన ముఖ ద్వారం సచివాలయ సౌధం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.

ఇదంతా కెసిఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనే. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సిఎం కెసిఆర్ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం జరిగింది. విమర్శకుల మాటలను తిప్పికొట్టేలా దీనిని నిర్మించాం. విమర్శలు చేసే వారికి విషయం, జ్ఞానం, లౌక్యం తెలియదు’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీన ఈ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘మనతెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఆయన మాటల్లోనే…..
2021 జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభం
దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల నుంచి ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌లను ఆహ్వానించి చివరకు ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్‌ను సచివాలయ భవనానికి కన్సల్టెంట్‌గా నియమించాం. ఈ భవన నిర్మాణానికి రూ.617 కోట్లు మంజూరుచేస్తూ సెప్టెంబర్ 10, 2020న సిఎం కెసిఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కిటెక్ట్ సంస్థ సమర్పించిన ప్లాన్ ఆధారంగా భవనాన్ని నిర్మించాలని సిఎం ఆదేశించారు. దేశంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ఈ భవనాన్ని నిర్మించడంలో భాగంగా పనులను చేపట్టింది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించాం. ఈ ఏప్రిల్ నెలాఖరుకు నాటికి 26 నెలల సమయం పూర్తవుతుంది. ఆర్ అండ్ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), టిఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ భవనం ఎత్తు 265 అడుగులు కాగా (80 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించాం.
1500ల మంది కార్మికులతో….
ఈ నూతన భవనానికి మొత్తం 26 నెలల సమయం పట్టింది. అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువమందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాం. మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500ల మందితో ప్రారంభమై చివరకు 4000 వేల మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు.
నూతన సచివాలయాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించాం. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఏ,బి,సి,డి విభాగాలుగా పేర్లు పెట్టాం.

ఒక్కో విభాగాన్ని కొన్ని శాఖలకు కేటాయించాం. అన్ని అంతస్థుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్‌లను నిర్మించాం. ఆరో అంతస్థులో క్యాబినెట్ మీటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశాం. సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్యభాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశాం. చుట్టూ రోడ్లతో పాటు నలుదిక్కులా గేట్లను అమర్చాం. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఏర్పాట్లు చేశాం.
చారిత్రక కట్టడాలకంటే ఎత్తులో..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీకృత సచివాలయ భవన నిర్మాణం దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలకన్నా ఎంతో ఎత్తైనది. ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటుచేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా నిర్మించాం. ఆరో అంతస్థులో సిఎం, సిఎస్, సలహాదారుల కార్యాలయాలను ఏర్పాటు చేశాం. మూడువైపులా పార్కింగ్‌ల కోసం ఏర్పాట్లు చేశాం.

ఈ 28 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించాం. 90 శాతం ఓపెన్‌స్పేస్‌లో ఉంచాం. పార్కింగ్‌ను 6 ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశాం. 10 ఎకరాల్లో లాన్‌ను ఏర్పాటు చేశాం. ఈ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తికావడానికి ఆర్ అండ్ బి అధికారులు 24 గంటలు శ్రమించారు. ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతిరెడ్డి పనులు త్వరితగతిన పూర్తి కావడానికి తనవంతు కృషి చేశారు.
రాజస్థాన్ దోల్ పూర్ ఎర్రటి ఇసుక రాతితో
రాజస్థాన్ దోల్ పూర్ ఎర్రటి ఇసుక రాతితో క్లాడింగ్‌ను ఏర్పాటుచేశాం. ఇది అమితంగా ఆకట్టుకుంటోంది. భవనానికి అమర్చిన రంగు రంగుల విద్యుత్ దీపాలు రాత్రివేళల్లో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వివిధ వర్ణాల మధ్య భవనం వెలిగిపోతోంది. భారీ భవనం ముందు ఉన్న విశాలమైన పచ్చిక బయళ్లు సుందరంగా కనిపిస్తున్నాయి. లాన్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫౌంటెయిన్లు ఆకర్షణీయంగా నిలిచాయి.

భవనం విశేషాలు…
s 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించాం.
s ఆరో అంతస్థులో సిఎం, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు, ప్లానింగ్ బోర్డ్ విసి, సిఎం కార్యదర్శుల చాంబర్లున్నాయి.
s కింది నుంచి ఐదో అంతస్థు వరకు సెక్రటరీలు, వివిధ శాఖల ఆఫీసులు.
s లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూంలు, వివిధ సేవలు.
s ఉద్యోగుల కోసం ప్రతి అంతస్థులో ఒక లంచ్ రూమ్ నిర్మాణం.
s రికార్డులు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, భవన నిర్వహణ తదితర ఆఫీసులను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటుచేశాం.
s బ్యాంక్, ఏటీఎం, డిస్పెన్సరీ, సందర్శకులకు పాస్‌లు జారీచేసే కౌంటర్, క్యాంటీన్ తదితర దక్షిణ యాన్సిలరీ బిల్డింగ్‌లో ఏర్పాటుచేశాం.
s ఫైర్ స్టేషన్, క్రెషి, డిస్పెన్సరీ, ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్, సెక్యూరిటీ సిబ్బందికి వెస్ట్ యాన్సిలరీ బిల్డింగ్‌లు ఉన్నాయి.
s సౌత్-వెస్ట్‌వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించాం.
s సందర్శకుల కోసం 160 కార్లు, 300 బైక్‌లకు సౌత్-ఈస్ట్ వైపు పార్కింగ్ సౌకర్యం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News