Friday, November 22, 2024

‘ఇదీ’ పునర్నిర్మాణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతీక నూతన సచివాలయమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు ఇది గుండెకాయగా నిలిచిందన్నారు. అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని ఆయన వెల్లడించారు.

సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలిగి పోతున్నాయన్నారు. పెద్ద పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందని, నీళ్లు రానే రావు, సాధ్యం కాదు, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారని కెసిఆర్ చెప్పారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైద రాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారని ఆయన తెలిపారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందన్నారు. అనేక విభాగాలు కలిసి పని చే యడం వల్లే ప్రగతి సాధ్యమైందని కెసిఆర్ వెల్ల డించారు. అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నా మన్నారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు, సి ఎస్ నుంచి గ్రూప్ -4 ఉద్యోగుల వరకు అందరికీ నమస్కరిస్తున్నానన్నారు.

మండు వేసవిలో మత్తడి దుంకే చెరువులే పునర్నిర్మాణానికి భాష్యం రాష్ట్ర పునర్నిర్మాణంపై గత పాలకులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశామన్నారు. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని పిచ్చివాళ్లు కొందరు కారుకూతలు కూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏమిటీ? ఉన్నదాన్ని కూలగొట్టి మళ్లీ కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్ల కడతారా? అని విపరీతమైన, దుర్మార్గమైన కురచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం దేనిని పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగామని అదే పునర్ నిర్మాణమన్నారు. నా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం గర్వంగా ఉందని తాను ప్రకటిస్తున్నానన్నారు. మండు వేసవిలో మత్తడి దుంకే చెరువులే పునర్నిర్మాణానికి భాష్యమని ఆయన తెలిపారు.

తెలంగాణ పునర్ నిర్మాణం అంటే కాళేశ్వరమే…

పునర్నిర్మాణం అంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు నాలుగు మాటలు చెప్పదలచుకున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. పునర్నిర్మాణం అంటే నాడు సమైక్య పాలనలో చిక్కిశల్యమైపోయి, శిథిలమైపోయి రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కోల్పోయి అద్భుతమైన కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మాణమైన చెరువులను పునరుద్ధరించి ఎండాకాలంలో కూడా మత్తల్లు దుంకే చెరువులే పునఃనిర్మాణానికి భాష్యంగా ప్రస్తుతం నిలిచాయన్నారు. ఉద్యమం సందర్భంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా నదీమాతకు నాణేలు వేసి రెండుచేతులు జోడించి దండంపెట్టి తల్లీ మా భూమి మీదకు ఎప్పుడు వస్తవ్? మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాడినని కెసిఆర్ తెలిపారు. నాటి సమైక్య రాష్ట్రంలో దుస్థితి ఏంటంటే గోదావరి డబ్బులు, రాగి నాణేలు వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కొని రామగుండం వద్ద బిడ్జి మీద నుంచి నడిచి ఎక్కడ చిన్నపాటి గుంతలో నీళ్లు కనిపిస్తే వేసే వాడినన్నారు. ఈ రోజు రామగుండానికి వెళ్తే కళ్ల ముందే నీళ్లు కనబడుతున్నా యన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఇరిగేషన్ చీఫ్ సెక్రెటరీల ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాజ్టెకు శిఖరాయమానంగా ప్రపంచానికే తలమానికంగా వెలిగిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం అని ఆయన పేర్కొన్నారు.

దేశంలోనే అధిక పంట పండేది తెలంగాణలోనే….

ఆనాడు నెర్రలుబారి నోళ్లువెల్లబెట్టి బీళ్లుగా లక్షలాది ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని లక్షల ఎకరాల పంట పొలాలు వెదజల్లుతున్న హరితకాంత్రే తెలంగాణ పునర్నిర్మాణమని ఆయన తెలిపారు. ఈ యాసంగి పంటలో భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు కాగా, ఇందులో 56 లక్షల ఎకరాల పంట తెలంగాణలో పండుతుందన్నారు. ఆ పొలాల్లో కనిపిస్తున్న హరితక్రాంతే తెలంగాణ పునర్నిర్మాణమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం. ఒక పాలమూరు ఎత్తిపోతల పథకం. ఒక సీతారామా ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. అర్ధరాత్రి కరెంటు పోయి ఎప్పుడు వస్తుందో తెలియక, పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో నేడు అవన్నీ మాయమై అద్భుతమైన కాంతులతో వెలుగుజిలుగులతో జాజ్వల్యమానంగా, కరెంటు వెలుగులతో విరాజిల్లుతోందని ఇది తెలంగాణ పునిర్మాణమని ఆయన తెలిపారు.

కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునఃనిర్మాణం

గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరాలుతున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమని ఇదే పునర్ నిర్మాణమని కెసిఆర్ తెలిపారు. క్షీణించిపోయి, పత్తాలేకుండాపోయి అగమైనపోయిన అడవులు అటవీశాఖ అధికారుల పట్టుదలతో దేశంలోనే ఆల్‌టైం రికార్డుగా హరితశోభను వెదజల్లడమే పునర్ నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునఃనిర్మాణమని ఆ అర్భకులు, ఆ మరుగుజ్జులకు ఈ విషయం చెబుతున్నానని కెసిఆర్ తెలిపారు.

భూలోక వైకుంఠంగా యాదాద్రి

యాదాద్రి భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోందని కెసిఆర్ పేర్కొన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమేనన్నారు. కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాలు అనేలా ప్రాజెక్టులు కట్టుకున్నామని, కొత్త సచివాలయ ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు ఈ సందర్భంగా కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాల ఏర్పాటు

ఐటిలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోందని ఇది కూడా పునర్ నిర్మాణంలో భాగమేనన్నారు. ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కెసిఆర్ తెలిపారు. ఈ 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు, 33 పోలీస్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల నిర్మాణాలు కూలగొట్టి కట్టామన్నారు. సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. పదేళ్లలో చిన్న అల్లర్లు కూడా లేకుండా శాంతిభద్రతలు కాపాడామని పేర్కొన్నారు. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు నేడు పరిశుభ్రతతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయని ఇది పునర్ నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.

మరుగుజ్జుల్లారా!.. జాగ్రత్త

మరుగుజ్జుల్లారా!.. జాగ్రత్త ఇప్పటికైనా మీ కుళ్లులు భంజేసుకోవాలని కెసిఆర్ మనవి చేశారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో ఎన్నెన్నో ఫ్లై ఓవర్‌లు, ఎన్నో అండర్ పాస్‌లు, ఎన్నో రకాల సౌకర్యాలతో ముందుకు పోతుందన్నారు. నలువైపులా నిర్మాణం అవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,వరంగల్ హెల్త్ సిటీ ఇవీ తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు.

అభివృద్ధికి సూచీకలు రెండు మాత్రమే….

అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా ఎండలో, వానలో ఫైళ్లు పట్టుకొని పరిగెత్తుకొనే పరిస్థితుల నుంచి అద్భుతంగా శోభాయమానంగా, శిఖరాయమానంగా హైదరాబాద్‌లో తలఎత్తుకొని పునర్ నిర్మాణంలో భాగంగా ఈ సెక్రటేరియట్ నిలిచిందన్నారు. ఈ పరిపాలన సౌధం ఇంకా అద్భుతంగా ముందుకు పోతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో అభివృద్ధిని రీ కన్‌స్ట్రక్షన్‌ను కొలమానంగా తీసుకునే సూచీకలు రెండే రెండనీ ఆయన తెలిపారు. ఒకటి తలసరి ఆదాయం కాగా, రెండోది తలసరి విద్యుత్ వినియోగం అని కెసిఆర్ తెలిపారు.

అద్భుత, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ….

అద్భుత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మిగిలిన రాష్ట్రంగా కొనసాగుతూ, పెరుగుతూ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా రూ.3,00,017లతో పర్ కాపిటా ఇన్కమ్‌లో నంబర్‌వన్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. ఒకనాడు 1,100 యూనిట్లే పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ ఉన్న రాష్ట్రం నేడు 2,140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్ర భాగాన ఉన్న అద్భుతమైన పర్ కాపిటా యుటిలైజేషన్ తెలంగాణ పునర్మిర్మాణంలో భాగమని కెసిఆర్ తెలిపారు. నిరాదరణకు గురై మూలిగి, ముక్కిపోయిన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు అద్భుతంగా రూ.2016 ల ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో గ్రామాల్లో వెలిగిపోతున్న ముఖాలే తెలంగాణ పునర్ నిర్మాణపు వెలుగు దివ్వెలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది

తెలంగాణ ప్రస్తుతం వెలుగు జిలుగులతో విరాజిల్లుతోందని కెసిఆర్ పేర్కొన్నారు. గతంలో కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోయారని, కానీ, నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారని సిఎం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయని కెసిఆర్ అన్నారు. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నామని, హరితశోభను వెదజల్లుతున్నాయన్నారు. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారని కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారని ఇది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా జరిగిందన్నారు. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకఅని, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్‌లోని గోండు ప్రజలు సైతం తాగుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

అంబేద్కర్ అడుగుజాడల్లో….

సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతుందని, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్రం సిద్ధించిందన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకొని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామన్నారు. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలన్న ఉద్ధేశ్యంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నామని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.

తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన ఆలోచనతో…

తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక చర్చలు మనం చూశామని, పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని, కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారన్నారు. వారికి ధీటైన సమాధానం చెప్పాలని ఈ 9 ఏళ్లలో చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేశామని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News