సిద్దిపేట: నీటి వనరులపై నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో చేపలు పట్టే మత్స్యకారులకు కొత్త సొసైటీల ఏర్పాటు కసరత్తు త్వరితగతిన ప్రారంభం చేయాలని జిల్లా మత్స్యకార శాఖ అధికారులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా 12 వేల మందికి సభ్యత్వం కల్పించాల్సి ఉన్నదని సమీక్షలో మంత్రి దృష్టికి తీసుకరాగా వెంటనే పూర్తి చేయించాలని ఆయన సూచించారు. కొత్త సభ్యులకు ప్రభుత్వ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, బీమా సౌకర్యం లభించనున్నాయని వివరించారు.
సంఘాల్లో చేరే వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికే మెంబర్‌షిప్ ఇవ్వనున్నట్లు బెస్త, ముదిరాజ్ కులస్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, చిన్నకోడూర్ ఎంపిపి కూర మాణిక్ రెడ్డి, నాయకులు చందర్ రావు, ఆర్డీఓ ఆనంతరెడ్డి, ఇరిగేషన్ ఇఇ సాయి బాబా, డిఇ, ఎఇఇ ఖాజా, ఎఇఇ అమరజీవి, తదితరులు పాల్గొన్నారు.