మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్‌ను నిర్మించాలని నిర్ణ యం తీసుకున్నామని, మార్చిలో భవనానికి శంకుస్థాపన చేస్తామని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చే స్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఢిల్లీ వచ్చిన ఆయన ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎంపిగా ఎన్నుకున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంపిగా ఎన్నుకొని రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారని, ఎప్పటికీ భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. భువనగిరి ఎంపిగా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఇంటికో వె య్యి వేసుకొని ప్రజలే తనను గెలిపించారన్నారు. ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణంపై నేడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని కోమటిరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వ మంచి, చెడులపై కేబినెట్‌లో చర్చ చేస్తామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానని, కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు. 2019లో భువనగిరి ఎంపిగా గెలిచిన కోమటిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి బిఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు పొందారు. ఈ క్రమంలోనే రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కోమటిరెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో తన పార్లమెంట్ సభ్యత్వానికి ఆయన రాజీనామా సమర్పించారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.