లండన్ : ఆఫ్రికా దాటి 30 దేశాలకు మించి మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి కొత్త వ్యాక్సిన్ భాగస్వామ్య వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ విధానం వల్ల వ్యాక్సిన్లు, వైద్య చికిత్సలకు చక్కని అనుసంధానం ఏర్పడుతుందని ,కొన్ని వారాల్లో ఇది సిద్ధమౌతుందని డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయేసెస్ పేర్కొన్నారు. గతనెల వందలాది మంకీపాక్స్ కేసులు నమోదువుతున్నాయని బ్రిటన్ , కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా దేశాలు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త వ్యవస్థను ప్రతిపాదించడమైందని చెప్పారు. స్మాల్‌పాక్స్‌కు ఉపయోగించే వ్యాక్సిన్లే 85 శాతం మంకీపాక్స్ నివారణలో సమర్ధంగా పనిచేస్తాయని డబ్లుహెచ్‌ఒ యూరప్ డైరెక్టర్ హాన్స్‌క్లుగే బుధవారం వెల్లడించారు. ఆఫ్రికాకు సరఫరా గురించి ఆలోచించకుండా ధనిక దేశాలు ఎక్కువగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడంపై ఆందోళన వెలిబుచ్చారు.