భారత్‌లో మరో ప్రమాదకరమైన వేరియంట్
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో బి.1.1.28.2
భారీగా తగ్గుతున్న శరీరం బరువు: ఎన్‌ఐవి
న్యూఢిల్లీ: భారత్‌లో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ బి.1.1.28.2ను పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ వారం రోజుల్లోనే రోగి శరీర బరువును భారీగా తగ్గించ గలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ తరహా లోనే ఇది కూడా మానవ రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీల సామర్ధాన్ని తగ్గించ గలదని పుణె లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) పరిశోధకులు వెల్లడించారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరి జన్యుక్రమాలను విశ్లేషించగా, బి.1.1.28.2 వేరియంట్ ను గుర్తించినట్టు చెప్పారు. దీన్ని తొమ్మిది ఎలుకల్లో ప్రవేశ పెట్టి పరీక్షించగా, ఇన్‌ఫెక్షన్ సోకిన వారం రోజుల్లోనే లక్షణాలు బయటపడడం ప్రారంభమైందని చెప్పారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ భారీగా వ్యాపించడంతో మూడు ఎలుకలు చనిపోయాయని పేర్కొన్నారు. శరీరం బరువు తగ్గిందని, శ్వాసకోశ, ఊపిరి తిత్తుల్లో సమస్యలకు కారణమైందని, తెలిపారు. ఈ కొత్త వేరియంట్ డెల్టా వేరియంట్‌తో సమానమని, ఆల్ఫా వేరియంట్ కంటే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఈ కేసులు ఎక్కువగా లేవని స్పష్టం చేశారు.
New Variant B.1.1.28.2 induced body Weight loss