నిత్యం 15 లక్షల కొత్త కేసులొస్తున్నాయి : గుటెర్రస్
న్యూయార్క్ : కరోనా తగ్గినట్టే తగ్గి అంతలోనే కొత్త వేరియంట్ల రూపంలో కలవరపెడుతోంది. పొరుగున చైనాతోసహా అమెరికా, ఐరోపా దేశాల్లో మరో దఫా విజృంభిస్తోంది. దీనిపై ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. కరోనా ముగింపు దశలో లేదని హెచ్చరించారు. ఇప్పుడు ప్రతిరోజూ 15 లక్షల కరోనా కేసులొస్తున్నాయి. ఆసియాలో కరోనా ఉధ్ధృతంగా ఉంది. ఐరోపాలో కొత్త వేవ్ విస్తరిస్తోంది. మహమ్మారి ప్రారంభం నుంచి చూసుకుంటే కొన్ని దేశాల్లో ప్రస్తుతం అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు , వ్యాప్తి ఎంత వేగంగా ఉంటాయనే దానికి ఒమిక్రాన్ మనకొక రిమైండర్ అంటూ గుటెర్రస్ అన్నారు.
ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మందికి ఇంకా టీకా అందలేదన్నారు. కానీ కొన్ని సంపన్నదేశాలు మాత్రం రెండో బూస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసమానతలను ఎత్తి చూపుతోందన్నారు. ఈ ఏడాది మధ్యనాటికి 70 శాతం మంది జనాభాకు టీకా అందించాలన్న లక్షానికి మనం చాలా దూరంలో ఉన్నాం. మరోపక్క సగటున ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్ వెలుగుచూస్తోన్న తరుణంలో సమయం చాలా ముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, ఔషధ సంస్థలు కలిసి పనిచేయాలి. సంపన్న దేశాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతివ్యక్తికి టీకా అందేలా కృషి చేయాలని సూచించారు.