హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఈ ఏడాది చివరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఫోటోలు అస్పష్టంగా ఉంటే మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 24 నుంచి జులై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్ కేంద్రాల గుర్తింపును నిర్ధారణ చేయనున్నారు.
జులై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొందించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటారు. కమిషన్ అనుమతి లభించగానే అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. www.nvsp.in ద్వారా అన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు.