రోమ్ : ఇటలీ లోని మిలన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేకేఎఫ్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన విమానం వడగళ్లు, పిడుగుల వానలో చిక్కుకోవడంతో అత్యవసరంగా రోమ్‌లో ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్ నుంచి బయల్దేరేసరికి వాతావరణం అనుకూలంగానే ఉంది. అయితే 15 నిమిషాల తరువాత తీవ్రమైన వడగళ్లు,
పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది. దీంతో విమానం ముక్కు, రెక్కలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికావడంతో అత్యవసరంగా రోమ్‌లో ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ “ మిలన్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన డెల్టా ఫ్లైట్ 185 ను వాతావరణం కారణంగా రోమ్‌లో ల్యాండ్ చేశాం. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు ” అని వెల్లడించారు. ప్రస్తుతం విమానం స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
విమానానికి జరిగిన నష్టాన్నిమాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాల్లో విమానం ముక్కు పూర్తిగా ధ్వంసం అయినట్టు కనిపిస్తోంది. రెండు ఇంజిన్లు, రెక్కలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విమానంలో 215 మంది ప్రయాణికులు, 8 మంది సహాయక సిబ్బంది , ముగ్గురు పైలట్లు ఉన్నారు. వడగళ్ల వానలో చిక్కుకొన్నాక విమానం ఒక్కసారిగా అదుపు తప్పిందని ప్రయాణికులు వెల్లడించారు. ఒక దశలో విమానం ముక్కలైపోతుందేమోనని భయపడ్డామని ఓ ప్రయాణికురాలు పత్రికలకు వెల్లడించారు. రోలర్ కోస్టర్ ఎక్కినట్టు తమకు అనిపించిందని తన అనుభవాన్ని వివరించారు.