Tuesday, February 25, 2025

సెమీస్‌లో న్యూజిలాండ్, భారత్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇంటికి
రావల్పిండి: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ గ్రూప్‌ఎ నుంచి సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. అంతేగాక భారత్ కూడా సెమీస్‌కు చేరింది. ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 15 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన కివీస్‌ను రచిన్ రవీంద్ర, డెవోన్ కాన్వే ఆదుకున్నారు.

కాన్వే 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన టామ్ లాథమ్ అండతో రచిన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇటు లాథమ్ అటు రచిన్ అద్భుత బ్యాటింగ్‌తో కివీస్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించారు. ఈ జోడీనివిడగొట్టేందుకు బంగ్లాదేశ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. సమన్వయంతో ఆడిన లాథమ్ 3 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ఇక చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అలరించిన రచిన్ 105 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 112 పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ ఫలిప్స్ 21 (నాటౌట్), మిఛెల్ బ్రేస్‌వెల్ 11(నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తంజిద్ హసన్, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో శుభారంభం అందించారు. ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే ధాటిగా ఆడుతున్న తంజిద్ (24)ను మిఛెల్ బ్రేస్‌వెల్ ఔట్ చేశాడు. దీంతో 45 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత వచ్చిన మెహదీ హసన్ మిరాజ్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు.

మిరాజ్ 13 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు తౌహిద్ హృదయ్ (7), వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం (2), మహ్మదుల్లా (4) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శాంటో పోరాటం కొనసాగించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శాంటో 110 బంతుల్లో 9 ఫోరలతో 77 పరుగులు చేశాడు. చివర్లో జాకేర్ అలీ (45), రిశాద్ హుస్సేన్ (26)లు కాస్త రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు 236 పరుగులకు చేరింది. కివీస్ బౌలర్లలో మిఛెల్ బ్రేస్‌వెల్ నాలుగు, విలియమ్ ఓరోర్కే రెండు వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News