Wednesday, January 22, 2025

న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్..

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
మూడో వన్డేలోనూ నెదర్లాండ్స్ చిత్తు
హామిల్టన్: నెదర్లాండ్స్‌తో సోమవారం జరిగిన మూడో చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. కాగా ఈ గెలుపుతో కివీస్ 30తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన విల్ యంగ్ శతకంతో చెలరేగారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

ఈ జోడీని విడగొట్టేందుకు డచ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యంగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గుప్టిల్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 203 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గుప్టిల్ 123 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఇక ధాటిగా బ్యాటింగ్ చేసిన విల్ యంగ్ 112 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 120 పరుగులు సాధించాడు. ఇక కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడిన రాస్ టెలర్ 14 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్(23), బ్రేస్‌వెల్(22) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ స్టెఫాన్ మైబుర్గ్(64) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్‌కు వరుసగా మూడో ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్రీ నాలుగు, బ్రేస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టారు.

New Zealand beat Netherlands by 115 runs in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News