Sunday, November 17, 2024

కివీస్‌దే తొలి టి20

- Advertisement -
- Advertisement -

ఆక్లాండ్: పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు అయూబ్, రిజ్వాన్‌లు మెరుపు ఆరంభాన్ని అందించారు. చెలరేగి ఆడిన అయూబ్ 8 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న అయూబ్ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు.

తర్వాత వచ్చిన బాబర్ ఆజమ్ కూడా దూకుడుగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ 2 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 25 పరుగులు సాధించాడు. అతన్ని సౌథి వెనక్కి పంపాడు. మరోవైపు ఫకర్ జమాన్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇఫ్తిఖార్ అహ్మద్ రెండు సిక్స్‌లు, ఒక బౌండరీతో 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన బాబర్ ఆజమ్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కివీస్ బౌలర్లు కీలక సమయంలో వరుస క్రమంలో వికెట్లను తీసి పాక్ ఇన్నింగ్స్‌ను 180 పరుగులకే పరిమితం చేశారు. టిమ్ సౌథి నాలుగు, మిల్నే, బెన్ సియర్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

మిఛెల్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కాన్వే (0) ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ ఫిన్ అలెన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన అలెన్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 9 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన డారిల్ మిఛెల్ 27 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో నాలుగు బౌండరీలతో 61 పరుగులు చేశాడు. చాప్‌మన్ 11 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. దీంతో కివీస్ స్కోరు 226 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News