ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీమ్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ఎ ఆరంభ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ సెంచరీలతో కదం తొక్కారు. చెలరేగి ఆడిన లాథమ్ 104 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లోనే 4 సిక్సర్లు,
3 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 107 పరుగులు సాధించాడు. దీంతో కివీస్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజమ్ (64), ఖుష్‌దిల్ షా (69), సల్మాన్ ఆఘా (42) తప్ప మిగతావారు విఫలమయ్యారు. దీంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో విలియమ్, సాంట్నర్ మూడేసి వికెట్లను పడగొట్టారు.