ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఆదివారం దుబాయిలో జరిగే ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బాగానే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్ తెంబ బవుమా (56) పరుగులు చేశాడు. వండర్ డుసెన్ (39), మార్‌క్రమ్ (31) పరుగులు చేశారు. ఇక డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ మూడు, ఫిలిప్స్, హెన్రీ రెండేసి వికెట్లను పడగొట్టారు.
కేన్, రచిన్ దూకుడు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన యంగ్ 3 ఫోర్లతో 21 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇటు కేన్ అటు రచిన్ కుదురుగా ఆడడడంతో కివీస్ కోలుకుంది. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రచిన్, విలియమ్సన్ తమ మార్క్ షాట్లతో అలరించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు.
ఇద్దరు సమన్వయంతో ఆడి జట్టును సురక్షిత స్థితిలో నిలిపారు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రచిన్ రవీంద్ర 101 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కేన్‌తో కలిసి రెండో వికెట్‌కు 164 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన డారిల్ మిఛెల్ కూడా మెరుపులు మెరిపించాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 94 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేసి వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన మిఛెల్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేశాడు. చివర్లో గ్లెన్ పిలిప్స్ 27 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు సాధించాడు. దీంతో కివీస్ స్కోరు 362 పరుగులకు చేరింది.