ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీ లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్.. అదే జోరును ఫైనల్‌లోనూ చూపించి కప్ సొంతం చేసుకోవాలని ఉర్రూతలూగిపోతుంటే.. తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకొని కప్ సాధించాలని కివీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో తమ అభిమాన జట్టు విజయం సాధించాలని ఇరు దేశాల అభిమానులు తెగ ఆరాటపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో భారత జట్టు గురించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ శ్రేయస్ అయ్యర్ అని ఆయన పేర్కొన్నారు. అయ్యర్‌తో పాటు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కూడా మ్యాచ్‌కి కీలకం కాబోతున్నాడని అంచనా వేశారు. మొత్తానికి న్యూజిలాండ్ బౌలర్లు టార్గెట్ చేసేది మాత్రం శ్రేయస్‌నే అని ఆకాశ్ పేర్కొన్నారు. అందుకు కారణం కూడా చెప్పారాయన ‘‘న్యూజిలాండ్‌పై కేవలం ఒకసారి మాత్రమే శ్రేయస్ 30 కంటే తక్కువ పరుగులు చేశాడు.. కానీ ప్రతీసారి అతను బాగానే రాణించాడు. కాబట్టి ఈసారి అతన్ని ఎక్కువగా టార్గెట్ చేయొచ్చు ముఖ్యంగా శ్రేయస్ స్పిన్‌ని బాగా ఆడుతాడు కదా.. అందుకే అతన్ని తొందరగా పెవిలియన్ పంపేందుకు స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు’’ అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు.