హామిల్టన్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 20తో క్లీన్ స్వీప్ చేసింది. 269 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. శుక్రవారం నాలుగో రోజు ఆట ఆరంభించిన కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ టామ్ లాథమ్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తనపై వేసుకున్నాడు. అతనికి రచిన్ రవీంద్ర అండగా నిలిచాడు.
సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విలియమ్సన్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. రచిన్ రవీంద్ర (20) పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ తర్వాత వచ్చిన విల్ యంగ్ అండతో విలియమ్సన్ మరో వికెట్ కోల్పోకుండానే కివీస్‌కు విజయం సాధించి పెట్టాడు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 260 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన విల్ యంగ్ 8 ఫోర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో కివీస్ మరో రోజు ఆట మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి టెస్టులో కూడా న్యూజిలాండ్ జయకేతనం ఎగుర వేసింది.