లండన్ : టీమిండియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం తమకు సవాల్ వంటిదేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రపం చ క్రికెట్లోనే టీమిండియా చాలా బలమైన జట్టుగా కొనసాగుతుందన్నాడు. దీంతో విరాట్ సేనతో పోరు తమకు సవాల్‌గా మారిందన్నాడు. అయితే తమ జట్టు మాత్రం గెలుపే లక్షంగా బరిలోకి దిగుతుందన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్టు కేన్ వివరించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. కానీ బలమైన భారత్‌ను ఓడించాలంటే తాము అసాధారణ ఆటను కనబరచక తప్పదన్నాడు. ఇక భారత్‌తో పోరు తామంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామన్నాడు. టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహణతో సుదీర్ఘ ఫార్మాట్ అన్ని జట్లలోనూ ఆసక్తి పెరిగిందన్నాడు.
ఒకవేళ కరోనా ఆటంకం కలిగించకపోతే ఈ చాంపియన్‌షిప్ మరింత ఆసక్తికరంగా సాగేదనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక రెండేళ్ల కాలంలో టెస్టు ఫార్మాట్లో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయన్నాడు. ఇటీవల భారత్ఆస్ట్రేలియా జట్ల జరిగిన టెస్టు సిరీసే దీనికి నిదర్శనమన్నాడు. రెండు జట్లు కూడా విజయం కోసం సర్వం ఒడ్డి పోరాడడంతో టెస్టుల కు కొత్త జీవం లభించిందన్నాడు. ఇక ఫైనల్ సమరానికి ముందు తాము ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుండ డం కూడా తమకు కలిసివచ్చే అంశమన్నాడు. ఇందులో విజయం సాధిస్తే భారత్‌తో పోరుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యే అవకాశం దొరుకుతుందన్నాడు. ఇంగ్ల ండ్‌పై మెరుగైన ప్రదర్శన చేసి భారత్‌తో సమరానికి సమరోత్సాహంతో సిద్ధం కావడమే లక్షంగా పెట్టుకున్నామని స్పష్టం చేశాడు. ఇక కివీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటన కోసం లండన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విలియమ్సన్ ఈ విషయాలను వెల్లడించాడు.