వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ చరిత్ర లోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలు విద్యుత్తు అందకపోవడంతో చీకట్లో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గంటకు 140 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దాదాపు 11 మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయని న్యూజిలాండ్ వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధాని క్రిస్ హిప్‌కిన్స్ మాట్లాడుతూఏ ప్రజలు నిద్రలేచే సమయానికి విపత్తు అమాంతంగా ముంచుకొచ్చిందని పేర్కొన్నారు. గత 24 గంటల్లో తాము పరిస్థితిని పరిశీలించగా ప్రజల అత్యవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని క్రిస్ వెల్లడించారు.
కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్, ఉత్తర ఐలాండ్ ప్రాంతాలను భారీ తుపాను తాకింది. గత నెలలో ఆక్లాండ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో నలుగురు మరణించారు. క్రైస్ట్‌చర్చ్ భూకంపం (2011), కొవిడ్ వ్యాప్తి (2020) తర్వాత న్యూజిలాండ్ లో తాజాగా ఇప్పుడే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తాజాగా 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దేశంలో ఉత్తర ఐలాండ్ లోని కొన్ని భాగాల్లో 30 జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేశారు. ఇక ఆక్లాండ్ ఎయిర్ పోర్టు నుంచి దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు. నేపియర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఫిబ్రవరి సగటు కంటే మూడు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. న్యూజిలాండ్ వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన రెడ్ వార్నింగ్ జారీ చేసింది.