Thursday, January 23, 2025

జోరుమీదున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

పుణే: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు సౌతాఫ్రికా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా ఐదింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆస్ట్రేలియా, భారత్‌లతో జరిగిన చివరి మ్యాచుల్లో కివీస్‌కు పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ అసాధారణ పోరాట పటిమను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది.

389 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 383 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని భావిస్తోంది. సౌతాఫ్రికాపై గెలిచి మళ్లీ గెలుపు బాటలో ప్రయాణించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు రెండు జట్లలోనూ కొదవలేదు. డికాక్, బవుమా, మార్‌క్రమ్, వండర్ డుసెన్, క్లాసెన్, మిల్లర్, జాన్‌సెన్, కొయేట్జి, కేశవ్ మహారాజ్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

డికాక్ వరుస శతకాలతో అలరిస్తున్నాడు. మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సౌతాఫ్రికా బలంగా ఉంది. కేశమ్, జాన్‌సెన్, రబడా, ఎంగిడి, కొయెట్జి వంటి మ్యాన్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపే లక్ష్యంగా…
న్యూజిలాండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తోంది. కాన్వే, యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, టామ్ లాథమ్, ఫిలిప్స్, నిషమ్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కాన్వే, రవీంద్రలు ఫామ్‌లో ఉండడం కివీస్‌కు అతని పెద్ద ఊరటగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో రవీంద్ర కళ్లు చెదిరే శతకం సాధించాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్‌లోనూ కివీస్ బాగానే ఉంది. ఫెర్గూసన్, బౌల్ట్, నిషమ్, ఫిలిప్స్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News