న్యూస్ డెస్క్: తమకు అమెరికా గుర్తింపు ఉందని మాయమాటలు చెప్పి మోసగించిన స్వయం ప్రక్రటిత ఆధ్మాత్మిక గురువు నిత్యానందకు చెందిన కాల్పనిక దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో సిస్టర్ సిటీ ఒప్పందం(రెండు నగరాల మధ్య ఒప్పందం) రద్దు చేసుకున్నట్లు అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన న్యూఎక్ నగర ప్రెస్ సెక్రటరీ బుధవారం ప్రకటించారు. ఈ మోసాన్ని పరిగణనలోకి తీసుకుని కైలాసతో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ అగ్రిమెంట్ అర్థరహితమని, అది చట్టవిరుద్ధమని సుసాన్ గారోఫలో పేర్కొన్నారు. కైలాసకు చెందిన వాస్తవాలు బయటపడిన వెంటనే జనవరి 11న కైలాసతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే..ఒప్పందం రద్దయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను అమెరికా గుర్తించిందని, తమతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందని తన అధికారిక వైబ్‌సైట్‌లో కైలాస ప్రకటించడం విశేషం.
జనవరి 11న న్యూఎక్ నగరమేయర్ రాస్ బరాకా, నగర నాయకులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులతో సిస్టర్ సిటీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తలపాగా ధరించి, మెడలో బంగారు నగలు వేసుకున్న ఒక మహిల కైలాస తరఫున ఒప్పందంపై సంతకం చేయగా అదే వేషధారణలో ఉన్న మరో మహిళ కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కైలాస అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. నిత్యానందపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులు భారత్‌లో నమోదయ్యాయని, అతను ఆ ఆదేశం నుంచి పరారయ్యాడన్న వార్తలు చాలా ఆలస్యంగా న్యూఎక్ నగర పాలకులకు తెలియడం విశేషం.