జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యుల నిర్లక్షంతో గర్భిణీ స్త్రీ కి పురుడు పోయగా శిశువు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిల్ల చందు జేసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య రవళిక గర్భిణీ గా ఉండగా డెలివరీ కోసం గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అంగీకరించినట్లు చందు తెలిపారు. మధ్యాహ్నం విధులు ముగించుకుని మరొక వైద్యురాలు విధుల్లో చేరి నార్మల్ డెలివరి అయ్యే అవకాశం ఉందని రాత్రి 7 గంటలకు చేస్తామని ఎంతకూ చేయలేదన్నారు. శుక్రవారం ఉదయం 3 గంటలకు బలవంతంగా నార్మల్ డెలివరి చేయగా బాబు పుట్టాడని 3 కేజి 600 గ్రాములు ఉండగా ఆక్సిజన్‌పై ఉంచారు.
ఎందుకు ఉంచారని అడగడంతో ఉమ్మనీరు తాగాడని, సీరియస్ గా ఉందని, వెంటనే ఎంజిఎం కు తరలించాలని చెప్పారు. దీంతో వెంటనే శిశువును ఎంజిఎం ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్షం కారణంగానే శిశువు మృతి చెందాడని తండ్రి చందు, బంధువులు జిల్లా ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై బైటాయించి నిరసన చేపట్టారు. భూ భారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అటుగా వస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క లకు శిశువును చూపిస్తూ తండ్రి విలపించగా మంత్రి సీతక్క శిశువు మృతికి కారణాలపై ఒక కమిటీ వేసి వైద్యుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విరమించారు. నిర్లక్షంగా వ్యహరించిన వైద్యుల పై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.