Monday, December 23, 2024

లక్నో రాజ్‌భవన్ సమీపంలో మహిళ ప్రసవం.. ఆస్పత్రికి మృత శిశువు

- Advertisement -
- Advertisement -

లక్నో: లక్నో లోని రాజ్‌భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఆదివారం నాలుగున్నర నెలల గర్భిణి ఆడ శిశువును ప్రసవించింది. అయితే ఆమె మృత శిశువును ఆస్పత్రికి తీసుకువచ్చారని డాక్టర్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలోవైరల్ కావడంతో రాష్ట్ర వైద్యసేవలపై సమాజ్‌వాదీ నేత శివపాల్ యాదవ్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వైద్య ఆరోగ్య విభాగం మంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సిఎం బ్రజేష్ పాథక్ ఈ సంఘటనను ధ్రువీకరించారు. “ ఈ సంఘటన తెలిసిన వెంటనే తాను అక్కడకు వెళ్లానని, ఆ కుటుంబం రిక్షాలో వెళ్తుండగా, రాజ్‌భవన్ గేట్ నెం 13 వద్ద ఈ సంఘటన జరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియజేశారని మంత్రి వివరించారు.

పుట్టిన బిడ్డను వీరాంగన ఝల్కరీ భాయి మహిళా, శిశు సంక్షేమ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బిడ్డ చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆ తరువాత లక్నో లోని వైకుంఠ్ ధామ్ వద్ద మృతశిశువుకు సమాధి చేశారు. వీరాంగన ఆస్పత్రి వద్ద లేబర్ రూమ్ నిర్వహిస్తున్న డాక్టర్ ఈ సంఘటన పూర్వాపరాలు తెలియజేశారు. ప్రసవించిన మహిళ రూపాసోనికి రాత్రి 12.30 గంటలకు పరీక్షలు చేయడమైందని చెప్పారు. అయితే అంతకు ముందు పగటిపూట ఆమె ప్రసవ వేదన రాగా లక్నో లోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఇంజెక్సన్ ఇచ్చారని చెప్పారు.ఆమో ఇంటికి వెళ్లినా స్వస్థత చేకూరలేదని డాక్టర్ చెప్పారు. అయితే ఆమె ఆస్పత్రికి అంబులెన్స్‌లో కాకుండా రిక్షాలో రాడానికి సిద్ధపడ్డారని పాథక్ తెలిపారు.

రాజ్‌భవన్ బయటివాళ్లు కొంతమంది అంబులెన్స్‌ను పిలువగా, 25 నిముషాల్లో అంబులెన్సు చేరుకున్నా వారు రిక్షాలోనే రాడానికి సిద్ధ పడ్డారని పాథక్ చెప్పారు. అయితే ఏదెలాగున్నా ఇదంతా అంబులెన్స్ సకాలంలో లభ్యం కానందునే జరిగిందని సమాజ్ వాది నేత శివపాల్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రకటనల రూపంలో లక్షలు వెచ్చిస్తున్నా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ మాత్రం వెంటిలేటర్ సహాయంతో పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంబులెన్స్ దొరకనందునే ఆ గర్భిణి రిక్షాలో ఆస్పత్రికి వెళ్ల వలసి వచ్చిందని రాజ్‌భవన్ దగ్గర రోడ్డు పక్కన ప్రసవించవలసి వచ్చిందని విమర్శించారు. ఈ సంఘటన రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ వాస్తవాన్ని తెలియజేస్తుందని, ఇది మొత్తం వ్యవస్థకే సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News