మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహాల రూపొందించాలని, ఇందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు పెద్ద పీట వేయాలని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వివిధ విభాగాల పోలీసు అధికారులకు పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు అధికంగా చోట చేసుకుంటున్నాయని గుర్తించిన అధికారులు వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని తెలిపారు. సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా సారించడంతో పాటు గతంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన వారి డేటాను పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతంలో తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారన్న సమాచారం సేకరించాలని, రాష్ట్రంలో నేరం చేసేందుకు నేరస్తులు మున్ముందు నేరాలకు పాల్పడేందుకు భయపడాలని, నేరం చేసిన వారికి శిక్షపడేంతవరకు పోలీసులు వెంటపడాలని పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు.
ఈక్రమంలో వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్నవారి కోసం ములాఖత్‌లలో వస్తున్న వారి వివరాలు సైతం సేకరించాలని, నేరస్తులను కుటుంబ సభ్యులు కాకుండా ఇతర నేరస్తులు కలిసి పెద్ద నేరాలకు కుట్రలు చేయకుండా నియంత్రించాలన్నారు. కరడు కట్టిన నేరస్తులుండే జైళ్లలో నేరస్థాయిని బట్టి బ్యారెక్‌లు కేటాయించడంలో మరింత శ్రద్ద వహించాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు జైళ్ల శాఖ అధికారులకు సూచనలు చేయనున్నారు. వివిధ నేరాలకు పాల్పడిన వారు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నేరస్తులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డు మెయింటెన్ చేయాలన్న ఆదేశాలు అమలులో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల ఏరివేతలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్‌లు నిర్వహించాలని, కార్డన్ సర్చ్‌లలో లభ్యమైన నేర సమాచారాన్ని డేటా రూపంలో రూపొందించాలని ఉన్నతాధికారులకు తాజాగా ఇచ్చిన ఆదేశాలలో పేర్కొన్నారు. కార్డన్ సర్చ్‌లో ఏలాంటి డాక్యూమెంట్లు లేని వందలాది వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా వివిధ నేరాలకు పాల్పడిన నేరస్తులు రాత్రుళ్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారం సైతం కార్డన్ సర్చ్‌ల రిపోర్టులో పొందుపర్చాలని సూచనలు చేశారు.
అనుమానితులు, నేరాలకు వ్యూహాలు, ప్రజలకు భరోసా కార్డన్ సర్చ్‌ద్వారా సాధ్యమౌతుందని పోలీసు బాసులు వివరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించడం వల్ల ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత బలపడే అవకాశాలు మెండుగాఉంటాయని పోలీసు బాసులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మొదలు పెట్టిన నాటి నుంచి నేరాల శాతం కొంతమేర తగ్గినట్లు పోలీసు రికార్డులు సైతం వెల్లడిస్తున్నాయన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసు శాఖ మరిన్ని వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు పోలీసు బాసులు వివరిస్తున్నారు.
తీవ్ర నేరాలపై:
రాష్ట్రంలోని కీలక కేసుల ఛేదన, నేరాల దర్యాప్తు, నేరాల నియంత్రణకు పోలీసులు మరింత శ్రమించాలని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సిబ్బందిలో నైపుణ్యతకు పదునుపెట్టడం, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మరింత మెరుగపర్చే విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని సూచలిచ్చారు. పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగాల విస్తరణపై సమాలోచనలు సాగిస్తున్నామని, సంస్థాగత సమర్థత పెంపొందింపు విషయంలో ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నామని అధికారులు వివరిస్తున్నారు. భారీ ఎత్తున ఆర్థిక మోసాలు, కృరమైన నేరాలు చేసిన వారి కదలికలను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఫేస్ రికగ్నేషన్ ఆయుధాన్ని ప్రయోగించేందుకు సమాలోచనలు సాగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఫేస్ రికగ్నేషన్ ఆయుధాన్ని ఇప్పటి వరకు తప్పిపోయిన వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్నామని, ఇకపై సాంకేతిక పరిజానాన్ని బడా నేరస్తుల కదలికల కోసం వినియోగించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నేర ప్రవృత్తిని కొనసాగించే వారిపైనా సాంకేతిక పరిజ్ఞానంతో వారి కదలికలపై ఆరా తీయాలని కిందిస్థాయి అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఆదేశాలిచ్చామని పోలీసు బాసులు వివరిస్తున్నారు.