Wednesday, January 22, 2025

కొత్తగా 15 బిసి డిగ్రీ కళాశాలలు.. 33 గురుకుల విద్యాలయాలు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు
డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సులు
పూర్తి వసతులు.. బోధనా సిబ్బంది నియామకం
బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్

Newly 15 BC Degree Colleges in Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బిసి డిగ్రీ కాలేజీలను, 33 గురుకుల విద్యాలయాలను మంజూరు చేయడం గొప్ప విషయని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ తమది విద్యను అందించే విధానమని, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరని అన్నారు. ఇప్పటికే ఉన్న 261 గురుకుల విద్యాలయాలకు అదనంగా జిల్లాకొకటి చొప్పున కొత్తగా33 గురుకులాలను, 15 బిసి డిగ్రీ కళాశాలలను కేటాయిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. బిసి గురుకులాలు 19 నుంచి 310కి పెరిగాయని మంత్రి వెల్లడించారు. గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి సదుపాయాలతో వీటిలో ప్రవేశం కోసం విపరీతమైన డిమాండ్ నెలకొందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి 15 డిగ్రీ కాలేజీలను, 33 గురుకుల విద్యాలయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కేటాయించారని, అందుకు ప్రత్యేక ధన్యవాదాలని వెల్లడించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది విభాగాల కంప్యూటర్ సైన్స్ కోర్సులతో ప్రారంభిస్తున్నామన్నారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులతో పాటు అదనంగా 4800 మంది బిసి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విదంగా కరీంనగర్, హాలియాలకు డిగ్రీ కాలేజీలను కేటాయించామని, మిగతా వాటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయనుంది త్వరలోనే తెలియజేస్తామన్నారు. జిల్లాకొకటి చొప్పున కేటాయించిన 33 బిసి గురుకులాలకు సైతం స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని వీటిలోనూ ఈ సంవత్సరమే అడ్మిషన్లు అందిస్తున్న నేపథ్యంలో 5,6,7 తరగతులకు కలిపి ప్రతి విద్యాలయంలో 240 చొప్పున దాదాపు 8 వేలమంది బిసి విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే చాలా గురుకులాలకు సొంత భవనాల్ని సమకూర్చామని, దశల వారీగా అద్దె గృహాల నుంచి పక్కా భవనాల్ని నిర్మించి తరలిస్తామన్నారు.

కొత్తగా కేటాయించిన విద్యాలయాలకు సైతం సిబ్బందిని త్వరలో తీసుకుంటామన్నారు. బిసి సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతితో పాటు బ్లాంకెట్లు, జాకెట్స్, ట్రాక్ సూట్స్, కిచెన్ యుటెన్సియల్స్ తో పాటు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసామన్నారు. వానాకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చేసిన విజ్ణప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే రూ.80 కోట్లు మంజూరు చేశారని, ఈ సంవత్సరమే అన్ని గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 19 గురుకులాలు 7500 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా.. నేడు 310 గురుకులాలకు పెంచుకొని 16 డిగ్రీ కాలేజీలు, 142 కాలేజీలు, 152 స్కూళ్లతో 1,65,160 మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

బిసిలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో బిసిల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి, ఆత్మగౌరవ పనులను చేస్తున్నామన్నారు. వీటిని గిట్టని కొందరు అరాచకవాదులు ప్రతిపక్షాల పేరుతో రాష్ట్రంలో విద్వేషం సృష్టిస్తున్నారని, అలాంటి వాటి గురించి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా అభివృద్ధే ఎజెండా పనిచేస్తున్నామని, రాజకీయాలు మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుతామని, బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్దిని మాత్రమే చేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News