Thursday, December 26, 2024

పురుగుల మందు తాగి నవ దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్, పల్లవి అనే నవ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్‌ఐతోపాటు బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం … మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా, బుల్జా గ్రామానికి చెందిన పల్లవి (20) కొలహారి గ్రామానికి చెందిన సేవాలే విజయ్ (28) వివాహం గత ఏడాది మే నెలలో జరిగింది. వీరి కాపురం సవ్యంగా సాగుతున్నప్పటికీ గత కొంతకాలంగా పల్లవి అనారోగ్యం సరిగ్గా లేకపోవడంతో చికిత్స నిమిత్తం తల్లిగారి ఇంటికి వెళ్లి వచ్చేది. ఎప్పటిలాగే చికిత్స కోసం పుట్టింటికి వెళ్లిన పల్లవిని ఆమె సోదరుడు కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం కొలహరికి తెచ్చి వదిలి వెళ్లాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపు గడియపెట్టి ఉండడంతో

ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపులు తీయించి చూడగా పల్లవి పురుగుల మందు సేవించి ఆపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో ఆమె భర్త విజయ్ ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భార్య మృతి చెందడంతో మనస్థాపానికి గురైన భర్త విజయ్ ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతమైన తిరుపెల్లి శ్మశానవాటిక వద్ద పురుగుల మందు సేవించి తన బంధువులకు సమాచారం అందించాడు. దీంతో వారు అతనిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తీసుకురాగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దంపతులిద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహిత తండ్రి విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇమ్రాన్ తెలిపారు. విజయ్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News