Sunday, April 13, 2025

పెళ్లయిన 22 రోజులకే నవ వధువు బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

ఎన్నో కొత్త ఆశలు…మనసులో ఉన్న ఆలోచనలతో జీవితంపై ఎన్నో కలలతో అత్తారింట అడుగుపెట్టి, కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు పెళ్లయిన 22 రోజులకే అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ విషాధ ఘటన మంచిర్యాల జిల్లా, హాజిపూర్ మండలం, పెద్దంపేట పంచాయతీ పరిధిలో గల గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…హాజిపూర్ మండలం, టీకానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత,– శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె శృతి (21)ని పెద్దంపేట పంచాయతీ పరిధి గొల్లపల్లి గ్రామానికి చెందిన గర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల 16న (మార్చి) వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద ఎనిమిది తులాల బంగారు అభరణాలు, లక్ష రూపాయలతో నగదుతో పాటు వంట సామగ్రి అందజేశారు.

వివాహ సమయంలో ఒప్పుకున్న దాని ప్రకారం లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే, పెళ్లయిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్తామామలు లక్ష్మి, శంకరయ్య శృతిని మానసికంగా హింస పెడుతున్నారని తన తల్లిదండ్రులకు చెబుతూ వాపోయింది. ‘పెళ్లికి రూ.6 లక్షల వరకు ఖర్చు అయింది.. ఆ డబ్బులను మీ తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి’ అని శృతిపై ఒత్తిడి చేయడంతో ఈ నెల 7న రాత్రి రూ.50 వేలను అల్లుడికి అందజేసి మిగతా సొమ్మును తొందరలోనే ఇస్తామని నచ్చజెప్పి శృతి తల్లిదండ్రులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అయితే, అదనపు కట్నం కోసం తమ తల్లిదండ్రులను వేధిస్తుండటంతో శృతి తీవ్ర మనస్తాపానికి గురైంది.

మంగళవారం ఉదయం 6 గంటలకు అత్తింట్లో స్నానాల గదికి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో భర్త సాయి వెళ్లి పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని స్థానికులు శృతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థ్దలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె ఆత్మహత్యకు కారకులైన అత్త, మామతోపాటు భర్తపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News