Friday, November 22, 2024

విద్వేష ప్రసంగాలు, చానళ్ళ చర్చలు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశాన్ని పీడిస్తున్న రెండు అతి పెద్ద పెడధోరణుల మీద సుప్రీంకోర్టు దృఢ స్వరంతో మాట్లాడిన తీరు ఆహ్లాదకరంగా వుంది. ఇందులో ఒకటి దేశంలో బహిరంగంగా, నిర్భయంగా, పట్టపగలే సాగిపోతున్న విద్వేష ప్రసంగాలకు సంబంధించినది. రెండో అంశం టివి ఛానళ్లల్లో చర్చా కార్యక్రమాలకు సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్న యాంకర్ల ధోరణికి సంబంధించింది. ఈ రెండు విషయాల్లోనూ సెక్యులర్ రాజ్యాంగ విలువలకు తిరిగి ప్రాణం పోయగలిగితే అది దేశానికి చెప్పనలవికానంత మేలు అవుతుంది. మహాత్మా గాంధీ ముని మనుమడు, సామాజిక ఉద్యమకారుడు అయిన తుషార్ గాంధీ పిటిషన్‌పై విచారణలో ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ అధ్యక్షతన గల ధర్మాసనం విద్వేష ప్రసంగాలను ప్రస్తావించింది.

2021 డిసెంబర్‌లో ఢిల్లీలో హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో జరిగిన ధర్మసంసద్‌లో వక్తలు హింసకు పిలుపు ఇచ్చారని తుషార్ గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సంసద్ జరిగిన ఐదు మాసాలకు గాని ఢిల్లీ పోలీసులు ఆ ప్రసంగాల తీరుపై ప్రాథమిక అభియోగ పత్రాన్ని (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయలేదెందుకని సిజెఐ ప్రశ్నించారు. ఇప్పటికి కూడా కేసు దర్యాప్తులో వుందని చెప్పడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. 2018లో ఎస్ పూనావాలా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని తుషార్ గాంధీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మూక హింసకు పిలుపు ఇస్తూ ఎవరైనా ప్రసంగం చేసిన వెంటనే నిర్ణీత వ్యవధిలో ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆ కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో దానిని పాటించలేదని అన్నారు.

ఈ సందర్భంలో ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్వేష ప్రసంగాలకు పూర్తిగా తెరదించడానికి కేంద్ర ప్రభుత్వమే రంగ ప్రవేశం చేయాల్సి వుందని స్పష్టం చేసింది. దానికి నటరాజ్ స్పందిస్తూ విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి క్రిమినల్ చట్టాల్లో సమగ్రమైన మార్పులు తీసుకు రావాలని కేంద్రం భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే సందర్భంలో జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నల బెంచి టిఆర్‌పి (టెలివిజన్ రేటింగ్ పాయింట్లు)లను పెంచుకోడానికి టెలివిజన్ చానళ్ళు సంచలనాలను సృష్టిస్తున్నాయని, ఇందులో యాంకర్లు కీలక పాత్ర వహిస్తున్నారని అభిప్రాయపడింది. దేశానికి స్వేచ్ఛాయుతమైన, తులనాత్మకమైన మీడియా అవసరం వుందని అందుకు విరుద్ధంగా ఇప్పటి చానళ్ళు, వాటి యాంకర్లు ఒక ప్రత్యేక అజెండా మేరకు సమాజంలో చీలికలను పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నాయని ఈ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పత్రికల విషయంలో ప్రెస్ కౌన్సిల్ వున్నట్టుగానే టెలివిజన్ చానళ్ళకు కూడా అటువంటి ఏర్పాటు జరగాలని సూచించింది. చానళ్ళ చర్చల్లో ఒక పక్షం వైపు తూగుతూ వ్యవహరించే యాంకర్లను తొలగించిన సందర్భం ఒకటైనా వుందా అని ప్రశ్నించింది.

కేసు విచారణలో వుండగా నిందితులను దోషులుగా చిత్రించడం ఎంత మాత్రం తగదని కూడా చానళ్ళను హెచ్చరించింది. చానళ్ళకిచ్చిన స్వేచ్ఛను అవి తమ సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తే చాలా తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది. మనకి విద్వేష ప్రసంగాలు, సొంత అజెండాతో కూడిన టివి చర్చలకు మించిన అతి ముఖ్యమైన విషయాలున్నాయని, ఉద్యోగాలు లేక దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని న్యాయమూర్తి కెఎన్ జోసెఫ్ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రశంసించదగినది. విద్వేష ప్రసంగాలపై ఉత్తరప్రదేశ్ 580 కేసులు, ఉత్తరాఖండ్ 118 కేసులు పెట్టినట్టు ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు న్యాయమూర్తి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఇన్ని కేసుల్లో ఏ ఒక్కరికైనా శిక్షలు పడ్డాయా అనేది కీలక ప్రశ్న. అటువంటి ఉదంతం ఒక్కటి కూడా లేదు. చట్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోడానికి కేసులు పెట్టి తదుపరి చర్యలు తీసుకోకుండా వుంటే ఏమి బిజెపి ప్రభుత్వాలు సరిగ్గా ఈ పనే చేస్తున్నాయి. అందుచేతనే బిజెపి, దాని అనుబంధ సంస్థలకు చెందిన ముఖ్యులు తరచుగా విద్వేష ప్రసంగాలకు పాల్పడుతున్నారు. పాలకులే మతాల మధ్య చిచ్చు రగిలించడానికి ప్రాధాన్యమిస్తున్న చోట విద్వేష ప్రసంగాలను వారు అరికడతారని ఎలా ఆశించగలం? ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఆ సంస్థ పత్రికలు రెండింటికి ఇచ్చిన ఇంటర్వూల్లో ముస్లింలు తమ పరిధుల్లో తాముండాలని, ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించారు గనుక మళ్ళీ పాలించాలని వారు కోరుకోకూడదు అనే రీతిలో చెప్పడం కూడా దేశంలో విద్వేషాన్ని పెంచే దిగా వుంది. అందుచేత బాధ్యత గల స్థానాల్లోని వారు ముందుగా విద్వేష ప్రసంగాలను, వైఖరులను తీవ్రంగా ఖండించాలి. ప్రధాని మోడీ వంటి వారు కూడా తగిన పాత్రను పోషించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News