Wednesday, January 22, 2025

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్ట విరుద్ధం

- Advertisement -
- Advertisement -

ప్రబీర్ పుర్కాయస్తను వెంటనే విడుదల చేయండి
సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: యుఎన్‌పిఎ(నిరోధక) చట్టం కింద న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, ఆయనను వెంటనే జైలు నుంచివిడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. 2023 అక్టోబర్ 4న రిమాండు విధిస్తూ జారీచేసిన రిమాండ్ దరఖాస్తు కాపీని పుర్కాయస్తకు కాని ఆయన న్యాయవాది కాని అందచేయలేదని జస్టిస బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడి ధర్మాసనం తెలిపింది. పుర్కాయస్తను అరెస్టు చేయడం, తదనంతరం రిమాండు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది.

దిగువ కోర్టు సూచించిన మేరకు బెయిల్ బాండ్లను సమర్పించిన అనంతరం పుర్కాయస్తను విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అన్‌లాఫుల్ యాక్టివిటీస్(ప్రివెన్షన్) చట్టం, 1967 కింద 2023 అక్టోబర్ 3 నుంచి పుర్కాయస్త జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక సెల్ ఆయనను అరెస్టు చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం పుర్కాయస్తకు చెందిన న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు చైనా నుంచి భారీ స్థాయిలో నిధులు అందాయి.

ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి అంతరాయం కలిగిస్తుందని, దేశం పట్ల అవిధేయతను దారితీస్తుందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియను దెబ్బతీసేందుకు పీపుల్స్ అలయెన్స్ ఫర్ డెమోక్రసి అండ్ సెక్యులరిజం(పిఎడిఎస్) అనే గ్రూపుతో పుర్కాయస్త కుట్ర పన్నారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. కాగా..పంకజ్ బస్సల్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద తమకు సంక్రమించిన అధికారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) దుర్వినియోగం చేసినట్లు అభిశంసిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రాతిపదికగా తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News