Tuesday, February 11, 2025

బిజెపి ఎమ్మెల్యేల్లో నుంచే తదుపరి ఢిల్లీ సిఎం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ దశాబ్దపు పాలనను అంతం చేసి ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించి రెండు రోజులు గడిచాయి. బిజెపి తమ ముఖ్యమంత్రి (సిఎం) అభ్యర్థిని ఇంకా ప్రకటించవలసి ఉండడంతో ఆ పదవి కోసం పలు పేర్లు వినవస్తున్నాయి. వారిలో ఎంఎల్‌ఎలు కానివారు కొందరు ఉన్నారు. ఈ సస్పెన్స్ నడుమ తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంఎల్‌ఎల నుంచే ఉంటారని పార్టీ వర్గాలు సూచించాయి. న్యూఢిల్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన విశిష్ట ఘనత సాధించిన పర్వేష్ వర్మ పేరు సిఎం పదవికి ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో పశ్చిమ ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపిగా ఉన్న పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.

సిఎం పదవికి పేర్లు వినిపిస్తున్న ఇతర నేతల్లో ఢిల్లీ బిజెపి మాజీ అధ్యక్షుడు, మాలవీయ నగర్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎ సతీస్ ఉపాధ్యాయ్, పార్టీ సీనియర్ నేత విజేందర్ గుప్తా, కొత్తగా ఎన్నికైన జనక్‌పురి ఎంఎల్‌ఎ ఆశిష్ సూద్, ఉత్తమ్ నగర్ ఎంఎల్‌ఎ పవన్ శర్మ ఉన్నారు. అయితే, సిఎం పదవికి ఎంపిక చేసేటప్పుడు బిజెపి ఊహాగానాలను తోసిపుచ్చి. ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోవడం కద్దు. ఆ పదవికి మహిళా ఎంఎల్‌ఎ ఒకరిని కూడా పరిశీలించవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. బిజెపి నుంచి కొత్తగా ఎన్నికైన 48 మంది ఎంఎల్‌ఎలలో నలుగురు మహిళలు ఉన్నారు. వారు నీలమ్ పహల్వాన్, రేఖా గుప్తా, పూనమ్ శర్మ, శిఖా రాయ్. బిజెపి కుల సమీకరణాలను కూడా పరిశీలించవచ్చునని, షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) నుంచి ఒక ఎంఎల్‌ఎను ఎంచుకోవచ్చునని ఆ వర్గాలు సూచించాయి.

బిజెపి ఎంఎల్‌ఎలలో నలుగురు ఎస్‌సిలు రాజ్ కుమార్ చౌహాన్, రవికాంత్ ఉజ్జయిన్, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కైలాష్ గంగ్వాల్ ఉన్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 48 సీట్లను గెలుచుకున్న కొన్ని గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ముందు అనుసరించవలసిన మార్గంపై చర్చించారు. ఆ మరునాడు నడ్డా ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు తన నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళుతున్నందున ఆయన తిరిగి వచ్చిన తరువాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని బిజెపి వర్గాలు తెలిపాయి. కాగా, 26 ఏళ్ల తరువాత రాజధానిలో అధికారంలోకి తిరిగి వచ్చినందుకు సూచనగా బిజెపి వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తుందని పార్టీ వర్గాలు సూచించాయి. ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News