ముంబై: ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ దెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) కూటమి మూడవ సమావేశం సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్నది. ఈ సమావేశం శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ శనివారం ప్రకటించారు.
మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) సమావేశం అనంతరం సంజయ్ రౌత్ విలేకరులతో మాట్లాడుతూ ఇండియా సమావేశానికి రానున్న ముఖ్యమంత్రులతోసహా ప్రతిపక్ష నాయకులకు ఆగస్టు 31వ తేదీ రాత్రి శివసేన ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు నగర శివార్లలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు చర్చలు ప్రాంరంభమవుతాయని, సమావేశం అనంతరం విలేకరుల సమావేశం ఉంటుందని రౌత్ వివరించారు. ఇండియా సమావేశంలో పాల్గొనడానికి వచ్చే ప్రతిపక్ష నాయకులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ప్రయాణ సౌకర్యాల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవిఎ నాయకులు మాట్లాడతారని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు ఆయన తెలిపారు.