ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యే వ్యక్తి శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తెలిపారు.
మంగళవారం నాడిక్కడ అజిత్ పవార్ మాట్లాడుతూ..అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని శరద్ పవార్ స్వయంగా కొద్ది రోజుల క్రతితం చెప్పారని గుర్తు చేశారు. ఆయన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని మనం చూడాలని ఆయన అన్నారు. కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుందని, శరద్ పవార్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాక మార్చుకునే అవకాశం లేదని అజిత్ చెప్పారు.
Also Read: వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…
పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో ఎన్‌సిపి సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే, పిసి చాకో, నరహరి జర్వాల్, అజిత్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపె, జితేంద్ర అవ్హాద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండె, జయదేవ్ గైక్వాడ్, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారని అజిత్ పవార్ తెలిపారు. 1999లో ఎన్‌సిపి ఆవిర్భావం నుంచి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన శరద్ పవార్ మంగళవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వం మరో మూడేళ్లు మిగిలి ఉన్నందున మిగిలిన కాలాన్ని మహారాష్ట్రతోపాటు దేశానికి సంబంధించిన సమస్యలపై వెచ్చిస్తానని, పార్టీకి సంబంధించిన ఎటువంటి బాధ్యతను చేపట్టబోనని శరద్ పవార్ స్పష్టం చేశారు.